Manipur Polls: మణిపూర్‌ ఎన్నికల్లో హింస.. ముగిసిన మలి విడత పోలింగ్‌!

మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికల మలి విడత పోలింగ్‌ సైతం హింసాత్మక ఘటనల మధ్యే ముగిసింది. శనివారం మొత్తం 22 నియోజకవర్గాల్లో....

Published : 05 Mar 2022 19:27 IST

ఇంఫాల్‌: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మలి విడత పోలింగ్‌లో సైతం పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. శనివారం మొత్తం 22 నియోజకవర్గాల్లో రెండో విడత పోలింగ్‌ జరగ్గా.. సాయంత్రం 5గంటల వరకు 76.04శాతం పోలింగ్‌ నమోదైనట్టు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు.  మరోవైపు, పోలింగ్‌కు ముందు, తర్వాత పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో ఓటింగ్‌కు అంతరాయం ఏర్పడింది. కరోంగ్ నియోజకవర్గంలో పోలింగ్‌ కేంద్రం వద్ద హింస చోటుచేసుకోవడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతిచెందారు. 

సేనాపతి జిల్లాలో అత్యధికంగా 82.02శాతం పోలింగ్‌ నమోదు కాగా.. ఆ తర్వాత తౌబాల్‌ జిల్లాలో 78శాతం పోలింగ్‌ నమోదైంది. తొలి విడతలో పలుచోట్ల హింస చోటుచేసుకోవడంతో అప్రమత్తమైన అధికారులు.. ఈసారి భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అలాగే, మొత్తం 1247 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో కొవిడ్‌ నిబంధనల మధ్య పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించారు.  ఈ ఎన్నికల్లో 92మంది అభ్యర్థులు నిలవగా.. 8.38లక్షల మంది అర్హులైన ఓటర్లు ఉన్నారు.

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ సీఎం ఒ.ఇబోబి సింగ్‌ తౌబాల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పూర్తి మెజార్టీతో విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. ఒకవేళ ఒకట్రెండు సీట్లు తక్కువైనా పొత్తులకు తాము సిద్ధమేనని తెలిపారు. ఓట్ల లెక్కింపు ఈ నెల 10న జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని