PM Modi: వారి ప్రవర్తన బాధాకరం.. విపక్షాలు విసిరే బురదలోనూ ‘కమలం’ వికసిస్తుంది: మోదీ

కాంగ్రెస్‌ సహా విపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) విరుచుకుపడ్డారు. రాజ్యసభ(Rajya Sabha)లో తన ప్రసంగానికి అడ్డుతగలడం దురదృష్టకరమన్నారు.

Updated : 09 Feb 2023 17:00 IST

దిల్లీ: తమ ప్రభుత్వంపై విపక్షాలు ఎంతగా బురదచల్లినా ‘కమలం’ మరింతగా వికసిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అన్నారు. అదానీ వ్యవహారంపై రాజ్యసభ(Rajya Sabha)లో విపక్ష పార్టీల ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేస్తూ తన ప్రసంగానికి అడ్డు తగలడంపై ప్రధాని తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. కొందరు ఎంపీల భాష, ప్రవర్తిస్తున్న తీరు, చేస్తోన్న వ్యాఖ్యలు బాధాకరమన్నారు. రాష్ట్రపతి(President of India) ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగించిన ప్రధాని.. గత కాంగ్రెస్‌ పాలనను ఎండగడుతూనే విపక్షాల(Opposition Parties) తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘విపక్షాల తీరు చూస్తుంటే బాధేస్తోంది. ఇలాంటి ముఖ్యమైన సభలో నినాదాలు చేయడం దురదృష్టకరం. ప్రజా సమస్యలపై చర్చించాలన్న ఆలోచన వారికి లేదు. సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన కీలక సభలో ఇలా ప్రవర్తిస్తారా? మీరు విసిరే బురదలో కూడా ‘కమలం’ (భాజపా ఎన్నికల గుర్తు) వికసిస్తుంది. యూపీఏ ప్రభుత్వం ఏ సమస్యకూ పరిష్కారం చూపలేదు. దేశ ప్రగతిని నాశనం చేసింది. చిన్న చిన్న దేశాలు పురోగమిస్తున్న సమయంలో ఆరు దశాబ్దాల కాలాన్ని మన దేశం కోల్పోయింది. పరిష్కారం చూపేవాళ్లను అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు. ఎంత అడ్డుకున్నా ప్రజా సమస్యల పరిష్కారంలో మేం ఏమాత్రం వెనకడుగు వేయం. మా విధానాలతో దేశంలో దీర్ఘకాలిక సమస్యలకు  పరిష్కారం చూపగలుగుతున్నాం’’ అని ప్రధాని అన్నారు. 

అసలైన లౌకికత్వం ఏంటో మేం చూపించాం..

‘‘గత మూడు నాలుగేళ్లలోనే 11 కోట్ల ఇళ్లకు తాగునీరు అందించాం. 2014కు ముందు ఆ సంఖ్య కేవలం 3 కోట్లుగా మాత్రమే ఉండేది. 2014 వరకు దేశంలో సగం మందికి పైగా ప్రజలకు బ్యాంకింగ్‌ సదుపాయమే లేదు. గత తొమ్మిదేళ్లలో 48 కోట్ల ఖాతాలు తెరిపించాం. గత కొన్నేళ్లుగా మేం జన్‌ ధన్‌ ఆధార్‌ మొబైల్‌ ట్రినిటీ ద్వారా నేరుగా లబ్ధిదారులకు రూ.24లక్షల కోట్లు పంపిణీ చేశాం. ఆజాదీ కా అమృత్ కాల్ సమయంలో అందరికీ ప్రభుత్వ పథకాలతో ప్రయోజనం కలిగేలా ప్రజల సంతృప్త స్థాయిలను అందుకొనేలా పనిచేస్తున్నాం. ఇదే నిజమైన సెక్యులరిజం.  మేం సామాన్యుడి ముందుకు పథకాలు తీసుకెళ్లాం. 18వేలకు పైగా గిరిజన గ్రామాల్లో విద్యుత్తు వెలుగులు నింపాం. దేశ ప్రజల విశ్వాసం గెలుచుకున్నాం. మారుమూల పల్లెలను అభివృద్ధి చేశాం. కాంగ్రెస్‌  గత 4 దశాబ్దాలకు పైగా ‘గరీబీ హఠావో’ నినాదంతోనే కాలం వెళ్లదీసింది. ఎలాంటి వివక్ష లేకుండా అన్ని వర్గాల ప్రజలకూ మేం సంక్షేమ ఫలాలు అందిస్తున్నాం’’ అన్నారు. 

దేశం మా వెంటే..

‘‘దేశం మా వెంటే ఉంది. దేశ ప్రజలు మమ్మల్నే విశ్వసిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు తిరస్కరిస్తున్నారు. వారిని ఎప్పటికప్పుడు శిక్షిస్తున్నారు. గిరిజనుల కోసం కాంగ్రెస్ చిత్తశుద్ధితో గతంలో పనిచేసి ఉండి ఉంటే.. ఇప్పుడు వారి కోసం మేం ఇంత కష్టపడాల్సిన అవసరం ఉండేది కాదు. కాంగ్రెస్‌ పార్టీ ఆర్థిక, సామాజిక, రాజకీయ విధానాలన్నీ ఓటు బ్యాంకు రాజకీయాలపైనే ఆధారపడి ఉంటాయి’’ అని ప్రధాని విరుచుకుపడ్డారు.

ప్రతిపక్షాలు సైన్స్‌కు వ్యతిరేకం.. వాళ్లకు రాజకీయాలే కావాలి..

ఆదివాసీల కోసం తొలిసారిగా ఐదు రెట్లు నిధులు ఖర్చుచేశాం. వారికోసం ఈ బడ్జెట్‌లో రూ.1.20లక్షల కోట్లు కేటాయించాం. నిర్ణయాలు తీసుకోవడంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాం.. అంతేకాకుండా వారి సాధికారత కోసం మా ప్రభుత్వం పనిచేస్తోంది. ఏదో గాలివాటంలా కాకుండా.. మేం కష్టపడి పనిచేసి శాస్త్ర సాంకేతికత ద్వారా దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషిచేస్తున్నాం. కొవిడ్‌ కష్టకాలంలో టీకాలు అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలపైనా కొందరు నేతలు దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. మన శాస్త్రవేత్తలు రూపొందించిన టీకాలే 150 దేశాల ప్రజలను కాపాడాయి. ప్రతిపక్షాలు సైన్స్‌కు, టెక్నాలజీకి వ్యతిరేకం.. దేశం గురించి వారికేం బాధలేదు.. ఎప్పుడూ రాజకీయాలే చేస్తారు. ప్రభుత్వం విధానాలను సవరించడం ద్వారా డ్రోన్ల వాడకం సామాన్యులకు ప్రయోజనం చేకూరుస్తోంది. విపక్షాలు అర్ధసత్యాలతో కొత్త కథలు సృష్టించడం ద్వారా అసత్యాలను వ్యాప్తి చేస్తున్నాయి. రక్షణ రంగంలో భారత్‌ ఎగుమతులు ప్రస్తుతం రూ.లక్ష కోట్లకు పైనే ఉన్నాయి. దేశం ఆత్మనిర్భరత సాధించే దిశగా ఈ విభాగంలో కొత్త కంపెనీలు ప్రవేశిస్తున్నాయి’’ అని ప్రధాని అన్నారు. 

మరి, ఇంటి పేరులో నెహ్రూ అని ఎందుకు పెట్టుకోలేదు!

‘‘కాంగ్రెస్‌ పాలకులు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 356ను దుర్వినియోగం చేశారు. ఇందిరా గాంధీ 50 సార్లకు పైగా ఆర్టికల్‌ 356ను ప్రయోగించి ప్రభుత్వాలను పడగొట్టారు. ఎన్టీఆర్‌ చికిత్స కోసం అమెరికా వెళ్తే ఆయన ప్రభుత్వాన్ని పడగొట్టారు. ఎంజీఆర్‌ వంటి దిగ్గజాల ప్రభుత్వాలను కాంగ్రెస్‌ అక్రమంగా పడగొట్టింది. కాంగ్రెస్‌ పాలకులు 600లకు పైగా పథకాలకు గాంధీ, నెహ్రూ పేర్లు పెట్టారు (ఓ పత్రిక కథనాన్ని ఉటంకిస్తూ..). గాంధీ పేరు ఉన్న నేతలు తమ ఇంటి పేరులో నెహ్రూ అని ఎందుకు పెట్టుకోలేదు?’’ అని మోదీ ప్రశ్నించారు.

మరోవైపు, విపక్ష సభ్యుల ఆందోళనతో రాజ్యసభలో గందరగోళం నెలకొంది. వెల్‌లోకి దూసుకొచ్చిన పలువురు ఎంపీలు నిరసన తెలిపారు. ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీ గ్రూప్‌ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ) వేయాలని, దర్యాప్తు జరిపించాలంటూ నినాదాలు చేశారు. వారి నినాదాల మధ్యే ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు