రాజు మారితే రాజధాని మార్చాలా?:కనకమేడల

విభజన చట్టం ప్రకారమే అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేయడం జరిగిందని తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ స్పష్టం చేశారు.

Published : 10 Oct 2020 13:30 IST

విజయవాడ: విభజన చట్టం ప్రకారమే అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేయడం జరిగిందని తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ స్పష్టం చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేంద్రం నియమించిన కమిటీతోపాటు, వివిధ కమిటీల సిఫారసుల మేరకు రాజధానిపై నిర్ణయం జరిగిందన్నారు. శివరామకృష్ణన్‌ కమిటీ సిఫారసుకు వ్యతిరేకంగా రాజధానిని నిర్ణయించారనేది అవాస్తవమన్నారు. రాజధానిపై సామాజిక ముద్రవేసి దానిని తగలబెట్టాలనే ప్రయత్నం వైకాపా ప్రభుత్వం చేస్తోందని మండిపడ్డారు.

 రైతులు తమ జీవనాధారాన్ని త్యాగం చేస్తే, ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో వారిని అభద్రతా భావంలోకి నెట్టేసిందన్నారు. చంద్రబాబు ఏర్పాటు చేసిన రాజధానిని నాశనం చేయాలనే లక్ష్యంతో వైకాపా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆరోపించారు. రాజులు మారినప్పుడల్లా రాజధాని మార్చుకోవచ్చనేది  చట్టంలో ఉందా అని ప్రశ్నించారు. రాజధాని మార్పునకు సహేతకమైన ఒక్క కారణమైనా చూపించగలరా అని నిలదీశారు. రాష్ట్రపతి నోటిఫికేషన్‌తో హైకోర్టు ఏర్పడిందని, రాష్ట్రపతి నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా చట్టాలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు సైతం న్యాయవ్యవస్థ తీరుపై విమర్శలు చేయడం సరికాదని కనకమేడల రవీంద్రకుమార్‌ అన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని