అనుకున్న దానికంటే.. అమరావతిని అద్భుతంగా చంద్రబాబు తీర్చిదిద్దగలరు: ఎంపీ రఘురామ

త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌కు మంచి రోజులు వస్తాయని ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. తుళ్లూరులో దీక్షా శిబిరానికి వెళ్లిన ఆయనకు రాజధాని రైతులు, మహిళలు సాదర స్వాగతం పలికారు.

Updated : 13 Mar 2024 18:02 IST

అమరావతి: త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌కు మంచి రోజులు వస్తాయని ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. తుళ్లూరులో దీక్షా శిబిరానికి వెళ్లిన ఆయనకు.. రాజధాని రైతులు, మహిళలు స్వాగతం పలికి శాలువా కప్పి సన్మానించారు. తనను ఆంధ్రాలో అడుగుపెట్టకుండా వైకాపా అరాచకం సృష్టించిందని చెప్పారు. జగన్ ప్రభుత్వ దాష్టీకానికి అనేక ఇబ్బందులు పడ్డానని.. అయినప్పటికీ పోరాటం ఆపలేదని ఆయన వివరించారు. రాజధాని రైతులను కలిసేందుకు అనేక సార్లు రావాలనుకున్నా.. రాలేక దిల్లీలోనే సంఘీభావం తెలియజేశానన్నారు.

‘‘వచ్చే ఎన్నికల్లో తెదేపా-జనసేనకు 130 సీట్లు వస్తాయని తొలుత అంచనా వేశా. ఇప్పుడు భాజపా కూడా కలవడంతో 135 అంతకన్నా ఎక్కువ సీట్లు సాధిస్తారు. ఐదేళ్లు ఆలస్యమైనా అమరావతిని అనుకున్న దానికంటే అద్భుత నగరంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీర్చిదిద్దగలుగుతారు. ఈ నెల 17న చిలకలూరిపేటలో కూటమి ఉమ్మడి మహా సభకు కచ్చితంగా హాజరవుతా. వైకాపా ‘సిద్ధం’ సభకు మీడియాను రావొద్దని చెప్పడంతో గ్రాఫిక్స్‌ అని తేలిపోయింది. మరో నాలుగైదు రోజుల్లో ఎన్నికల కోడ్‌ వచ్చేస్తుంది. ఇక అందరం స్వేచ్ఛగా మన భావాలను వ్యక్తం చేయొచ్చు. చరిత్రలో ఇంత సుదీర్ఘకాలం సాగిన రైతు ఉద్యమం అమరావతి ఉద్యమమే. మరికొద్ది రోజుల్లో రైతుల పోరాటం పూర్తిస్థాయిలో ఫలిస్తుంది’’ అని రఘురామ ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని