Sharad Pawar: భాజపాతో పొత్తుకు సిద్ధమై : శరద్ పవార్‌పై ఎన్సీపీ నేత ఆసక్తికర వ్యాఖ్యలు

శరద్ పవార్ (Sharad Pawar) భాజపాతో పొత్తుకు సిద్ధమయ్యారట. అయితే చివరి నిమిషంలో సంకోచించి ఆగిపోయారట. 

Updated : 11 Apr 2024 15:10 IST

ముంబయి: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP)లో కీలక నేతగా ఉన్న అజిత్ పవార్, తన వర్గం నేతలతో కలిసి గతేడాది శరద్‌పవార్‌ (Sharad Pawar)కు షాకిచ్చిన సంగతి తెలిసిందే. తర్వాత మహారాష్ట్రలో ఉన్న భాజపా-శివసేన ప్రభుత్వంతో చేతులు కలిపి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు కూడా తీసుకున్నారు. అయితే ఆ సమయంలో కమలం పార్టీతో కలిసేందుకు శరద్‌ పవార్ కూడా సిద్ధమైనట్లు అజిత్ వర్గం నేత ప్రఫుల్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘గతేడాది జులై 2న అజిత్ పవార్, ఇతర నేతలు మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరారు. ఆ తర్వాత కొద్దిరోజులకు శరద్ పవార్‌ను కలిసి, మాతో చేరమని అభ్యర్థించాం. అనంతరం పుణెలో శరద్‌ పవార్, అజిత్ భేటీ అయ్యారు. ఆయన 50 శాతం సిద్ధమయ్యారు. కానీ ఎప్పుడూ చివరి నిమిషంలో తడబడతారు’’ అని పటేల్ వెల్లడించారు.

కాంగ్రెస్‌లో ఏక్‌నాథ్‌ శిందేలు లేరు.. పదేళ్లు రేవంతే సీఎం: మంత్రి కోమటిరెడ్డి

ఎన్‌సీపీలో చీలిక తర్వాత.. అజిత్‌ వర్గమే అసలైన ఎన్సీపీ అని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. పార్టీ చిహ్నం, ఎన్నికల గుర్తును వారికే కేటాయించింది. ఈ పరిణామం తర్వాత ఎప్పటికీ కాషాయ పార్టీతో చేతులు కలపబోనని శరద్‌పవార్‌ ప్రతిజ్ఞ చేశారట. ఇదిలాఉంటే.. ఇప్పుడు ఇద్దరు పవార్‌లు బారామతి స్థానంలో ప్రత్యక్ష పోరు చేస్తున్నారు. అజిత్‌ సతీమణి సునేత్ర పవార్‌పై ఆయన సోదరి సుప్రియాసూలే బరిలో నిల్చున్నారు. దీనిపై సుప్రియా స్పందిస్తూ.. ‘‘నేనెప్పుడు దీనిని వ్యక్తిగత పోరుగా చూడను. ఇది సిద్ధాంతపరమైన పోరాటం మాత్రమే’’ అని వ్యాఖ్యానించారు.

‘‘పవార్ కుటుంబానికి, మహారాష్ట్రకు వ్యతిరేకంగా భాజపా ఈ కుట్ర పన్నింది. సునేత్రను బరిలోకి దించడం అభివృద్ధి కోసం కాదు. శరద్‌ పవార్‌ను రాజకీయంగా అంతం చేసేందుకే. ఆ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత కూడా ఈ మాట అన్నారు. రాష్ట్రంలో కమలదళానికి బలమైన అభ్యర్థులు లేరు. కాబట్టే, నీచ రాజకీయాలకు పాల్పడుతోంది. మరాఠీ మాట్లాడే ప్రజల మధ్య చీలికలు సృష్టించేందుకు యత్నిస్తోంది. సైద్ధాంతికపరంగా సాగే మా పోరును వ్యక్తిగతం చేసింది’’ అని గతంలో భాజపాపై సూలే విరుచుకుపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని