Nitin Gadkari: ఆయన వ్యాఖ్యలు హాస్యాస్పదం.. ఉద్ధవ్‌ ఆఫర్‌పై గడ్కరీ

మహా వికాస్‌ అఘాడీ అభ్యర్థిగా పోటీ చేస్తే గెలిపిస్తామంటూ ఉద్ధవ్‌ ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ స్పందించారు.

Published : 13 Mar 2024 13:23 IST

దిల్లీ:  భాజపా (BJP)కు రాజీనామా చేసి వస్తే.. ‘మహావికాస్‌ అఘాడీ’ (MVA) తరఫున పోటీకి అవకాశం కల్పిస్తామని శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే  (Uddhav Thackeray) వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari)స్పందించారు. ఆయన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా, పరిణతిలేనివిగా ఉన్నాయని అన్నారు. కొద్ది రోజుల క్రితం భాజపా ప్రకటించిన తొలి జాబితాలో గడ్కరీ పేరు లేకపోవడంతో ‘‘ దిల్లీ ముందు తలవంచే బదులు ఆ పార్టీకి రాజీనామా చేస్తే.. అఘాడీ అభ్యర్థిగా నిలబెడతాం’’ అని ఇటీవల ఓ సభలో ఉద్ధవ్‌ వ్యాఖ్యానించారు. అప్పట్లో దీనిపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ (Devendra Fadnavis) స్పందించారు. గడ్కరీ వంటి జాతీయ నేతకు ఉద్ధవ్‌ లాంటి వ్యక్తి ఆఫర్ ఇవ్వడమంటే.. అమెరికాకు అధ్యక్షుడిగా చేస్తానంటూ ఒక సాదాసీదా వ్యక్తి మరొకరికి హామీ ఇవ్వడం లాంటిదేనని ఎద్దేవా చేశారు.

తాజాగా మరోసారి గడ్కరీని ఎమ్‌వీఏ అభ్యర్థిగా పోటీ చేయాలని ఉద్ధవ్‌ కోరారు. దీనిపై నితిన్‌ గడ్కరీ స్పందించారు. ‘‘భాజపాలో అభ్యర్థులకు టికెట్లు కేటాయించేందుకు ఒక విధానం ఉంది. దాని ప్రకారం కేటాయింపులు జరుగుతాయి’’ అని తెలిపారు. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో గడ్కరీ నాగ్‌పూర్‌ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈ సారి ఎన్నికల్లో భాజపా, ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని శివసేన, అజిత్‌ పవార్‌ ఆధ్వర్యంలోని ఎన్‌సీపీ పార్టీలతో కలిసి ‘మహాయుతి’ కూటమిగా ఎన్నికల బరిలో నిలవనుంది. దీంతో సీట్ల సర్దుబాటుపై కూటమిలో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్రలో భాజపా అభ్యర్థుల ప్రకటనలో జాప్యం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం అజిత్‌ పవార్‌ వర్గానికి నాలుగు లోక్‌సభ స్థానాలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. భాజపా 31 స్థానాలు, శివసేన (ఏక్‌నాథ్‌ శిందే) 13 స్థానాల్లో పోటీ చేయనుందని సమాచారం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని