LJP: జాతీయ అధ్యక్షుడిగా పశుపతి పరాస్‌

పశుపతి పరాస్ గురువారం లోక్‌జన శక్తి పార్టీ(ఎల్జేపీ) జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Published : 17 Jun 2021 21:41 IST

ఏకగ్రీవంగా ఎన్నికైన చిరాగ్ చిన్నాన్న

దిల్లీ: పశుపతి పరాస్ గురువారం లోక్‌జన శక్తి పార్టీ(ఎల్జేపీ) జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటికే ఆయన్ను లోక్‌సభాపక్ష నేతగా గుర్తిస్తూ లోక్‌సభ సచివాలయం నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 

దళిత నేత, దివంగత రాంవిలాస్ పాసవాన్ నెలకొల్పిన ఎల్జేపీలో కొద్ది రోజుల క్రితం తిరుగుబాటు జెండా ఎగిరింది. ఆయన చిన్న తమ్ముడు పశుపతి ఇందుకు నాయకత్వం వహించారు. రాంవిలాస్ కుమారుడు, లోక్‌సభ సభ్యుడు చిరాగ్ పాసవాన్‌ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. చిరాగ్‌తో కలిసి ఆ పార్టీ తరఫున ఆరుగురు లోక్‌సభ సభ్యులుండగా, అందులో ఐదుగురు ఒక వర్గంగా ఏర్పడ్డారు. చిరాగ్‌ను పార్టీలో ఒంటరిని చేశారు. 

మరోపక్క ఎల్జేపీ లోక్‌సభాపక్ష నేతగా పశుపతి నియామకం చెల్లదని, ఇది పార్టీ నిబంధనలకు విరుద్ధమని బుధవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు చిరాగ్‌ లేఖ రాశారు. తనను ఎల్జేపీ లోక్‌సభాపక్ష నాయకుడిగా గుర్తించి కొత్త సర్క్యులర్ జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే తనకు వ్యతిరేకంగా చేతులు కలిపిన ఐదుగురు ఎంపీలను పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. ఎల్జేపీలో చీలిక నేపథ్యంలో చిరాగ్ మీడియాతో మాట్లాడుతూ..తనను తాను ‘సింహం బిడ్డ’గా అభివర్ణించుకున్నారు. తన తండ్రి పార్టీని స్థాపించిన లక్ష్యం కోసం పోరాడతానని చెప్పుకొచ్చారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని