Himachal polls2022: ఆ హామీల్ని ప్రజలు సీరియస్‌గా తీసుకోరు.. రాహుల్ సారీ చెప్పాలి: నడ్డా

ప్రజలకు భాజపా ఉచితాలు ఇవ్వదని.. వారికి సాధికారత కల్పించే దిశగా పనిచేస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు.

Published : 09 Nov 2022 01:02 IST

దిల్లీ: ప్రజలకు భాజపా ఉచితాలు ఇవ్వదని.. వారికి సాధికారత కల్పించే దిశగా పనిచేస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. రాష్ట్రాల వారీగా యూనిఫాం సివిల్‌ కోడ్‌(యూసీసీ) అంశాన్ని చేపడతామని.. రాష్ట్ర స్థాయిలోనే దీన్ని అమలు చేస్తామని తెలిపారు. హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ చెబుతోన్న పాత పింఛను విధానం (ఓపీఎస్‌) పునరుద్ధరణ అంశాన్ని ఉద్యోగులు సీరియస్‌గా తీసుకోరన్నారు. ఈ విషయాన్ని పరిశీలించి ఓపీఎస్‌పై తమ పార్టీయే ఓ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. మంగళవారం ఆయన ఓ వార్తా సంస్థతో ఇంటర్వ్యూలో మాట్లాడారు. భాజపా ఉచితాల్ని విశ్వసించదు.. ప్రజలను ఆకర్షించడంపై కాకుండా వారికి సాధికారత కల్పించే దిశగానే పనిచేస్తుందన్నారు. ఆర్థికవనరుల్ని పరిగణనలోకి తీసుకోకుండా కాంగ్రెస్‌ ఇస్తున్న హామీలను ప్రజలు సీరియస్‌గా తీసుకోరని నడ్డా అభిప్రాయపడ్డారు. 

రాష్ట్రాల స్థాయిలో యూసీసీ అమలు
‘‘యూనిఫాం సివిల్‌ కోడ్‌ అంశం చాలా కీలకమైనది.. అధికారంలో ఉన్న పార్టీ దేశాన్ని చాలా సున్నితంగా నడాపాల్సి ఉంటుంది. అందుకే యూసీసీ అంశాన్ని రాష్ట్రాల వారీగా తీసుకొని హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాం. రాష్ట్రస్థాయిలో అమలు చేస్తాం. హిమాచల్‌ప్రదేశ్‌, గుజరాత్‌లలో భాజపా సులువుగా విజయం సాధిస్తుంది. ప్రతీ ఎన్నికనూ మేం చాలా సీరియస్‌గా తీసుకుంటాం. అదనపు ఒత్తిడిని తీసుకోం. ఏ రాష్ట్రంలోనూ మా పనితీరుపై రాజీ ఉండదు. ప్రతి ఎన్నిక ముఖ్యమైనదే. హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రభుత్వ అనుకూలత కనబడుతోంది. రాష్ట్రంలో భాజపా ప్రభుత్వానికి ప్రతికూల వాతావరణం కనబడటంలేదు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం జైరాం ఠాకూర్‌లు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు ఆమోదిస్తున్నారు’’ అన్నారు.

హిమాచల్‌లో కొత్త ట్రెండ్‌
‘‘దేశంలో భాజపా కొత్త ట్రెండ్‌ సృష్టిస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లో ఒకసారి ఒక పార్టీకి, మరోసారి ఇంకో పార్టీకి అధికారం ఇచ్చే సంప్రదాయానికి అక్కడి ప్రజలు స్వస్తి పలకాల్సిన సమయం ఆసన్నమైంది. ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గోవాలలో వరుసగా రెండోసారి భాజపా అధికారంలోకి వచ్చినట్టుగానే హిమాచల్‌ప్రదేశ్‌లోనూ జరుగుతుంది’’ అని నడ్డా ఆశాభావం వ్యక్తంచేశారు.

జాతికి రాహుల్ క్షమాపణ చెప్పాలి..
‘‘కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ దేశాన్ని ఏకం చేస్తున్నారా? విచ్ఛిన్నం చేస్తున్నారా? దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తున్న, ఉగ్రవాదుల పట్ల సానుభూతితో వ్యవహరిస్తున్న వారికి అనుకూలంగా ఆయన ఉంటున్నట్టు కనబడుతోంది. అందుకు జాతికి రాహుల్‌ గాంధీ క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్‌ చేస్తోన్న తప్పిదాలకు అనేకసార్లు పశ్చాత్తాపపడాలి. నేను పదవి కోసం ఏనాడూ ఆశపడలేదు. నా సొంత రాష్ట్రమైన హిమాచల్‌ప్రదేశ్‌లో రాజకీయ ఆశలు పెట్టుకోలేదు. నాకు అప్పగించిన పనిపైనే కేంద్రీకరిస్తూ పనిచేశాను తప్ప ఎలాంటి పదవుల కోసం ఆరాటపడలేదు. నేనెప్పుడూ ఏమీ అడగలేదని మాత్రం చెప్పగలను. నాకు  ఆశలు లేవు. పార్టీ వల్లే నేను ఇంత కీలక స్థానానికి చేరా’’ అని చెప్పారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని