Political roundup2022: ఉత్కంఠ రేపిన ఎన్నికలు.. ఊహించని రాజకీయ మలుపులు..!

2022 సంవత్సరం కాలగమనంలో కలిసిపోయింది. ఎన్నో కొత్త ఆశలతో ప్రజలు కొత్త ఏడాదిలోకి ప్రవేశిస్తున్నారు. ఈ ఏడాది కాలంలో దేశ రాజకీయ రంగంలో చోటుచేసుకున్న మలుపులు, కీలక పరిణామాలను ఓసారి పరిశీలిస్తే.. 

Published : 31 Dec 2022 01:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: 2022.. కాలచక్రం గిర్రున తిరిగింది. ఈ ఏడాది దేశ రాజకీయాల్లో అనేక కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. 2022 ఆరంభంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు(Assembly elections) జరగ్గా.. చివర్లో మరో రెండు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు దేశ రాజకీయాలను (Indian Politcs) హీటెక్కించాయి. వీటికి తోడు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలతో పాటు మహారాష్ట్ర, బిహార్‌ రాష్ట్రాల్లో ఊహించని రాజకీయ ట్విస్టులు, డ్రామాలకు ఈ ఏడాది వేదికగా నిలిచింది. ఆప్‌(AAP)లాంటి పార్టీలకు తీపి జ్ఞాపకాలను అందించగా.. మహారాష్ట్రలోని శివసేన(Shiv sena)లాంటి కొన్ని పార్టీలకు మాత్రం అత్యంత చేదు అనుభవాల్నే మిగిల్చింది. రాజకీయ రంగంలో ఈ ఏడాది చోటుచేసుకున్న కీలక ఘటనలు/పరిణామాలను ఓసారి అవలోకిస్తే..!

ఆప్‌ ‘పంజా’బ్‌.. సంచలన విజయం

ఫిబ్రవరి-మార్చి నెలలో దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు(Assembly elections) జరిగాయి. ఉత్తర్‌ప్రదేశ్, గోవా, మణిపూర్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో నాలుగు చోట్ల భాజపా(BJP) భారీ విజయం సాధించగా.. పంజాబ్‌లో ఆప్‌(AAP) ప్రభంజనం సృష్టించింది. అక్కడ అధికార కాంగ్రెస్‌(Congress)ను మట్టికరిపించి ఇతర పార్టీల ఎత్తుల్ని చిత్తుచేసి క్లీన్‌స్వీప్‌ చేసింది. మొత్తం 117 స్థానాలకు గానూ 92 సీట్లు గెలుచుకొని చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. అప్పటివరకు ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్‌(Congress) పార్టీ కేవలం 18 సీట్లకు పరిమితమైంది.

మహారాష్ట్రలో పొలిటికల్‌ హై‘డ్రామా’.. 

ప్రస్తుత రాజకీయాల్లో ఎప్పుడు ఎవరెవరు ఏ పార్టీతో చేతులు కలుపుతారో అంచనా వేయడం కష్టం. ఈ ఏడాది జూన్‌లో మహారాష్ట్ర రాజకీయాలు(Maharashtra Politics) దేశంలో హీటు పుట్టించాయి. ఈ ఏడాది జూన్‌లో మహారాష్ట్రలోని ఉద్ధవ్‌ఠాక్రే(Uddhav Thackeray) సారథ్యంలోని మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వానికి ఊహించని షాక్‌ తగిలింది. శివసేనలోని కీలక నేత ఏక్‌నాథ్‌ శిందే(Eknath sindhe) తన వర్గంలోని 40మందికి పైగా ఎమ్మెల్యేలతో సొంత పార్టీపైనే తిరుగుబావుటా ఎగురవేశారు. గుజరాత్‌, గోవాల్లో క్యాంపు రాజకీయాలు నడిపి ఆ తర్వాత భాజపాతో చేతులు కలిపి ఉద్ధవ్‌ ఠాక్రేకు గట్టి షాక్‌ ఇచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయి శివసేన (శిందే వర్గం), భాజపాతో కూడిన కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. శిందే సీఎంగా, దేవేంద్ర ఫడణవీస్‌ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత శివసేన పార్టీ నిట్టనిలువునా చీలిపోయింది. శివసేన పార్టీకి అన్నిహక్కులూ తమవేనంటూ శిందే వర్గం సుప్రీంకోర్టుకు వెళ్లగా.. ప్రస్తుతం శివసేనలోని ఉద్ధవ్‌, శిందే వర్గాల మధ్య న్యాయపోరాటం కొనసాగుతోంది.

ఉత్కంఠ రేపిన రాజ్యసభ పోరు

దేశవ్యాప్తంగా జూన్‌ 10న 15 రాష్ట్రాల్లోని 57 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికలు ఉత్కంఠను రేకెత్తించాయి. ఏపీ, తెలంగాణ, యూపీ, తమిళనాడు, బిహార్‌, మధ్యప్రదేశ్‌‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, పంజాబ్‌, ఝార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లోని 41 స్థానాలు ఏకగ్రీవం కాగా.. మహారాష్ట్రలో ఆరు, కర్ణాటక, రాజస్థాన్‌లో నాలుగేసి చొప్పున, హరియాణాల్లో రెండు స్థానాలకు పోలింగ్‌ జరిగింది. ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీల మధ్య హోరాహోరీగా పోరు కొనసాగింది. మహారాష్ట్రలో భాజపా మూడు సీట్లు గెలుచుకోగా.. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ చెరో స్థానంలో విజయం సాధించాయి. కర్ణాటకలో భాజపా మూడు సీట్లు, కాంగ్రెస్‌ ఒకటి గెలుచుకోగా.. హరియణాలో భాజపా ఒక సీటు, స్వతంత్ర అభ్యర్థి ఒక సీటు గెలుచుకున్నారు. 

రాష్ట్రపతి-ఉపరాష్ట్రపతి ఎన్నిక

ఈ ఏడాది జులైలో రాష్ట్రపతి, ఆగస్టులో ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి, కేంద్రమాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హాపై ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్ము భారీ విజయం సాధించారు. తద్వారా రాష్ట్రపతి పదవికి ఎన్నికైన తొలి ఆదివాసీ మహిళగా ఆమె చరిత్ర లిఖించారు. అలాగే, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి కేంద్ర మాజీ మంత్రి మార్గరెట్‌ ఆళ్వాను ఓడించి ఎన్డీయే అభ్యర్థి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ భారత 16వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.

బిహార్‌లో బిగ్‌ ట్విస్ట్‌!

ఆగస్టు నెలలో కాషాయ పార్టీకి జేడీయూ గట్టి షాక్‌ ఇచ్చింది. భాజపా నుంచి తన రాజకీయ మనుగడకు ముప్పు పొంచి ఉందన్న భావనతో జేడీయూ అధినేత, సీఎం నీతీశ్‌ కుమార్‌ ఆ పార్టీతో సుదీర్ఘ బంధానికి గుడ్‌బై చెప్పారు. ఎన్‌డీఏ కూటమి నుంచి వైదొలిగి ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీంతో నీతీశ్‌ కుమార్‌ ఎనిమిదో సారి సీఎంగా బాధ్యతలు చేపట్టగా.. డిప్యూటీ సీఎంగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ ప్రమాణస్వీకారం చేశారు. 

గాంధీ కుటుంబేతర వ్యక్తి ‘చేతి’కి పగ్గాలు

దాదాపు రెండు దశాబ్దాల తర్వాత గాంధీ కుటుంబేతర వ్యక్తి చేతికి కాంగ్రెస్‌ పార్టీ పగ్గాలు వెళ్లాయి. పార్టీ అధ్యక్ష పదవి కోసం ఎన్నికలు నిర్వహించగా.. కేంద్ర మాజీ మంత్రి మల్లిఖార్జున ఖర్గే, మరో మాజీ మంత్రి శశిథరూర్‌ పోటీలో నిలిచారు. పార్టీ విధేయునిగా పేరొందిన మల్లిఖార్జున ఖర్గేనే విజయం సాధించారు. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి చివరిసారిగా 2000 సంవత్సరంలో ఎన్నికలు జరిగాయి. మరోవైపు, ఈ ఏడాది కాంగ్రెస్‌కు పలువురు సీనియర్లు షాక్‌ ఇచ్చారు. కపిల్‌ సిబల్‌, గులాం నబీ ఆజాద్‌తో పాటు గుజరాత్‌లో పాటీదార్‌ ఉద్యమనేతగా ఉన్న  హార్దిక్‌ పటేల్‌ వంటి నేతలు పార్టీని వీడారు. సిబల్‌ సమాజ్‌వాదీ పార్టీ మద్దతుతో రాజ్యసభకు ఎన్నికవ్వగా.. ఆజాద్‌ మాత్రం జమ్మూకశ్మీర్‌లో డెమోక్రటిక్‌ ఆజాద్‌ పార్టీని స్థాపించారు. 

కాంగ్రెస్ భారత్‌ జోడో యాత్ర

భాజపా చేస్తోన్న విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా భారత ప్రజలను ఏకం చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ భారత్‌ జోడో యాత్ర పేరిట సుదీర్ఘ పోరాటానికి శ్రీకారం చుట్టింది. సెప్టెంబర్‌ 7న కన్యాకుమారిలో రాహుల్‌ మొదలు పెట్టిన ఈ యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. పలువురు రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు తమ మద్దతు ప్రకటిస్తూ రాహుల్‌తో కలిసి నడుస్తున్నారు. 12 రాష్ట్రాల మీదుగా 3500 కి.మీల మేర కొనసాగాల్సిన ఈ యాత్ర.. ఇప్పటికే తమిళనాడు సహా కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో పూర్తి చేసుకొని దిల్లీలోకి ప్రవేశించింది. ఈ యాత్రలో రాహుల్‌ గాంధీ తనదైన శైలిలో భాజపా, కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. కొద్ది రోజుల విరామం తర్వాత యూపీ, హరియాణా, పంజాబ్‌ రాష్ట్రాల్లో పర్యటించి చివరకు జమ్మూకశ్మీర్‌లో ముగియనుంది.

పశ్చిమతీరంలో ‘నమో’ సునామీ

గుజరాత్‌లో కాషాయ పార్టీ సునామీ సృష్టించింది. రికార్డుస్థాయిలో విజయం సాధించి తమకు ఎదురులేదని మరోసారి నిరూపించుకుంది. దశాబ్దాలుగా తన పట్టును పదిలం చేసుకుంటూ మొత్తం 182 సీట్లలో 156 సీట్లు సాధించి చరిత్ర సృష్టించింది. కాంగ్రెస్‌ కేవలం 17సీట్లకే పరిమితమైపోయింది. మోదీ ఛరిష్మా ముందు విపక్షాలన్నీ తేలిపోయాయి. తామే భాజపాకు ప్రత్యామ్నాయం అంటూ బరిలో నిలిచిన ఆప్‌నకు పరాభవం తప్పలేదు. మరోవైపు, హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ జయకేతనం ఎగురవేసింది. మొత్తం 68 సీట్లకు గాను 40చోట్ల గెలవగా.. భాజపా 25 స్థానాలకే పరిమితమైంది. గుజరాత్‌లో మరోసారి సీఎంగా భూపేంద్ర పటేల్‌ ప్రమాణ స్వీకారం చేయగా.. హిమాచల్‌ప్రదేశ్‌ సీఎంగా సుఖ్విందర్‌సింగ్‌ సుకు బాధ్యతలు చేపట్టారు.

ఆప్‌నకు స్వీట్‌ మెమొరీస్‌..!

ఈ ఏడాది ఆమ్‌ ఆద్మీ పార్టీకి స్వీట్‌ మెమొరీస్‌ని మిగిల్చింది. దశాబ్దం క్రితం అన్నా హజారే ప్రారంభించిన జన్‌లోక్‌పాల్‌ ఉద్యమం ద్వారా ప్రాచుర్యం పొందిన కేజ్రీవాల్‌ స్థాపించిన ఆప్‌ కేవలం పదేళ్ల వ్యవధిలోనే జాతీయ పార్టీగా అవతరించింది. దిల్లీ అసెంబ్లీలో వరుసగా రెండుసార్లు ఘన విజయాలు అందుకున్న ఆప్‌.. పంజాబ్‌లోనూ విజయఢంకా మోగించింది. అదే ఉత్సాహంతో ఇటీవల జరిగిన గుజరాత్‌, హిమాచల్‌ ఎన్నికల సమరంలోకి దూకి జాతీయ పార్టీగా ఎదిగేందుకు అవసరమైన ఓట్లు సాధించింది.

తెరాస ఇక భారాస

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పేరు డిసెంబర్‌ 9న భారత్‌ రాష్ట్ర సమితి (భారాస)గా మారింది. పార్టీ పేరు మార్పుపై అక్టోబర్‌ 5న విజయదశమి రోజు తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ పార్లమెంటరీ, శాసనసభాపక్ష, కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశంలో తెరాసను భారాసగా మారుస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ ఏకగ్రీవ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. అందుకనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయగా.. ఈసీ నుంచి క్లియరెన్స్‌ రావడంతో డిసెంబర్‌ 9న మధ్యాహ్నం 1.20 గంటలకు తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ భారాస పేరును అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించిన తెరాస.. ఆ కలను సాకారం చేసి  దేశ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసే లక్ష్యంతో భారాసగా మారడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని