PK: సంచలన నిర్ణయం

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను నిర్వహిస్తోన్న ఐ-పాక్‌(I-PAC) సంస్థ వ్యూహకర్త బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

Updated : 24 Dec 2022 15:18 IST

మళ్లీ రాజకీయాల్లో చేరికపైనా స్పష్టత

దిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను నిర్వహిస్తోన్న ఐ-పాక్‌(I-PAC) సంస్థ వ్యూహకర్త బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం చేస్తోన్న పనుల నుంచి విరామం తీసుకునే సమయం వచ్చిందని ఓ జాతీయ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్‌ కిశోర్‌ వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ అధికారంలోకి రావడంతో పాటు భాజపా రెండంకెల స్థానాలు గెలువదని ప్రశాంత్‌ కిశోర్‌ జోస్యం చెప్పిన విషయం తెలిసిందే. ఆయన చెప్పినట్లుగానే ఫలితాలు వెలువడుతున్న సమయంలోనే పీకే ఈ నిర్ణయాన్ని ప్రకటించడం విశేషం.

‘ప్రస్తుతం నేను చేస్తున్న(ఎన్నికల వ్యూహకర్తగా) వాటిని తదుపరి కొనసాగించాలని అనుకోవడం లేదు. ఇప్పటివరకు తగినంత చేశాను. ప్రస్తుతం వీటి నుంచి విరామం తీసుకొని జీవితంలో ఇంకేదైనా చేయాల్సిన సమయం వచ్చింది. ఇక పూర్తిగా (వ్యూహకర్తగా) వీటిని వదిలివేయాలి అనుకుంటున్నా’ అని ప్రశాంత్‌ కిశోర్‌ వెల్లడించారు. అయితే, మీరు మళ్లీ నేరుగా రాజకీయాల్లోకి ప్రవేశిస్తారా? అని అడిగిన ప్రశ్నకు..నేను ఓ విఫలమైన రాజకీయ నాయకుడినని సమాధానమిచ్చారు. భవిష్యత్తులో ఏమీ చేయాలో అనే విషయాన్ని ఆలోచించుకోవాల్సి ఉందన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తోన్న ఐపాక్‌(I-PAC Indian Political Action Committee)ను కొనసాగించడానికి సమర్థనాయకత్వం ఉందని ప్రశాంత్‌ కిశోర్‌ స్పష్టం చేశారు.

పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌కు వ్యూహకర్తగా ప్రశాంత్‌ కిశోర్‌ పనిచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నేతలు ప్రశాంత్‌ కిశోర్‌ మధ్య ట్విటర్‌ వేదికగా మాటలయుద్ధం నెలకొంది. దాంతో కాషాయ పార్టీకి కౌంటర్‌ ఇస్తూ గతేడాది డిసెంబరు పీకే ఓ ట్వీట్‌ చేశారు. ‘‘వాస్తవానికి పశ్చిమ బెంగాల్‌లో భాజపా రెండంకెల కంటే మించి సీట్లు సాధించలేదు. అంతకంటే ఎక్కువ సీట్లు వస్తే నేను ప్రస్తుతం చేపట్టిన బాధ్యతల నుంచి శాశ్వతంగా వీడుతా’’ అని ఆయన సవాల్‌ విసిరారు. అయితే, ఆయన చెప్పినట్లుగానే తృణమూల్‌, భాజపా ఫలితాలు స్పష్టంగా కనిపించాయి. మళ్లీ తృణమూల్‌ భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. అయినప్పటికీ తాను ఎన్నికల వ్యూహకర్త బాధ్యతల నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు పీకే ప్రకటించారు.

ఇదిలాఉంటే, పశ్చిమ బెంగాల్‌లోపాటు తమిళనాడులో స్టాలిన్‌ తరపున పీకే వ్యూహకర్తగా వ్యవహరించారు. ఆయన అంచనా వేసినట్లుగానే అటు మమతా బెనర్జీ, స్టాలిన్‌ విజయం సాధించారు.ఇక జేడీయూ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ప్రశాంత్‌ కిశోర్‌పై గతేడాది ఆ పార్టీ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఆయనను బహిష్కరిస్తున్నట్లు జేడీయూ ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని