జల్లికట్టు వేడుకల్లో రాహుల్‌ గాంధీ!

తమిళనాడులో ప్రారంభమైన జల్లికట్టు వేడుకలకు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, నటుడు ఉదయనిధి స్టాలిన్ పాల్గొని ఆరంభ వేడుకలను వీక్షించారు.

Published : 15 Jan 2021 03:25 IST

చెన్నై: సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో జల్లికట్టు వేడుకలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు ప్రసిద్ధి చెందిన మధురైలోని అవనియపురంలో తొలుత ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, డీఎంకే నేత, నటుడు ఉదయనిధి స్టాలిన్ పాల్గొని ఆరంభ వేడుకలను వీక్షించారు. ఈ సంవత్సరం తమిళనాడులో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాహుల్‌ గాంధీ జల్లికట్టు వేడుకల్లో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇక కరోనా నేపథ్యంలో జల్లికట్టు నిర్వహణపై తమిళనాడు ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ముఖ్యంగా 150 మంది కంటే ఎక్కువ మంది పోటీలో పాల్గొనరాదని, వీక్షకుల సంఖ్య 50శాతానికి మించరాదని ప్రభుత్వం ఆదేశించింది. జల్లికట్టు వేడుకలకు రాహుల్‌ గాంధీ రావడంతో కాంగ్రెస్‌ రాష్ట్రనేతలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. రైతుల జీవితంలో భాగమైన బసవన్న వేడుకలకు రాహుల్‌ గాంధీ రావడం ఎంతో గర్వకారణమని తమిళనాడు పీసీసీ హర్షం వెలిబుచ్చింది. అయితే, ఈ పర్యటనలో భాగంగా రాహుల్‌ గాంధీ ఎటువంటి ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోరని స్పష్టంచేసింది.

భాజపా విమర్శ
జల్లికట్టు వేడుకలపై కాంగ్రెస్‌ పార్టీ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందంటూ భారతీయ జనతా పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. ఇదివరకు జల్లికట్టును వ్యతిరేకించిన కాంగ్రెస్‌ పార్టీ, జల్లికట్టును నిషేధిస్తామని గత ఎన్నికల మానిఫెస్టోలో పెట్టిన విషయాన్నీ గుర్తుచేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న సమయం(2011)లో జల్లికట్టును నిషేధించడాన్ని భాజపా నాయకులు ప్రస్తావిస్తున్నారు. కేవలం రాష్ట్రంలో ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతోనే రాహుల్‌ గాంధీ జల్లికట్టుకు హాజరయ్యారని దుయ్యబట్టారు. ఇదిలాఉంటే, మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత జల్లికట్టుపై కాంగ్రెస్‌ పార్టీ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి..
తమిళనాడులో ఉత్సాహంగా జల్లికట్టు
సంక్రాంతి వేళ.. సెలబ్రిటీలు ఏమన్నారంటే..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని