Andhra News: విభజన జరిగి ఏడేళ్లు.. రాజధాని ఎక్కడో తెలియని పరిస్థితి: రామ్‌మాధవ్‌

దేశంలో మంచి వ్యవస్థల్ని నెలకొల్పినప్పుడే ప్రజలు ఎక్కడకు వెళ్లినా గౌరవం లభిస్తుందని భాజపా సీనియర్‌ నేత, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు రామ్‌ మాధవ్‌ అన్నారు. గుంటూరులోని

Updated : 27 Feb 2022 06:04 IST

గుంటూరు: దేశంలో మంచి వ్యవస్థల్ని నెలకొల్పినప్పుడే ప్రజలు ఎక్కడకు వెళ్లినా గౌరవం లభిస్తుందని భాజపా సీనియర్‌ నేత, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు రామ్‌ మాధవ్‌ అన్నారు. గుంటూరులోని జీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో సమాలోచన సంస్థ నిర్వహించిన ‘స్వాధీనత నుంచి స్వతంత్రత వైపు’ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేశారు.  స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లయినా మన దేశంలో ఇంకా స్వాభిమానం అలవాటు కాలేదని.. దీనికి అవినీతి రాజకీయ వ్యవస్థలే కారణమని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన జరిగి ఏడేళ్లు గడిచినా ఇంకా మనకు రాజధాని ఎక్కడో తెలియని పరిస్థితి నెలకొందని... ఇది మన రాజకీయ వ్యవస్థలోని లోపం కాదా? అని ప్రశ్నించారు.

దేశంలో తాజాగా నెలకొన్న హిజాబ్‌ వివాదంపైనా స్పందించారు. అరబ్‌ దేశాల్లో ముస్లిం మహిళలు బురఖాకు వ్యతిరేకంగా దశాబ్దాలుగా పోరాడుతున్నారని, సౌదీలో బురఖా అవసరం లేదని అక్కడి రాజు ప్రకటించారని తెలిపారు. కానీ, మనదేశంలో మాత్రం బురఖా ధరించాలని చెప్పి దాన్ని మత సమస్యగా మారుస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇది దేశంలో మతపరమైన విభజన తెచ్చేందుకు ప్రయత్నించటమేనని అభిప్రాయపడ్డారు. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో అందరూ ప్రధాని మోదీ సాయం కోరుతున్నారని తెలిపారు. కానీ, మనం శాంతి వైపు ఉన్నామని, అన్యాయానికి వ్యతిరేకంగా ఉంటామని రామ్‌మాధవ్‌ స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని