Maharashtra: బలపరీక్షపై సుప్రీంకు ఠాక్రే సర్కారు.. సాయంత్రం 5 గంటలకు విచారణ

మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మంత్రి ఏక్‌నాథ్‌ శిందే వర్గం తిరుగుబాటుతో సంక్షోభంలో పడిన ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వం మెజార్టీ నిరూపించుకోవాలంటూ రాష్ట్ర గవర్నర్‌ ఆదేశించారు. గురువారం

Published : 29 Jun 2022 11:44 IST

దిల్లీ: మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మంత్రి ఏక్‌నాథ్‌ శిందే వర్గం తిరుగుబాటుతో సంక్షోభంలో పడిన ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వం మెజార్టీ నిరూపించుకోవాలంటూ రాష్ట్ర గవర్నర్‌ ఆదేశించారు. గురువారం ఉదయం 11 గంటలకు ఈ బలపరీక్ష జరగనుంది. అయితే ఈ ఆదేశాలపై ఠాక్రే సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

గవర్నర్‌ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ శివసేన చీఫ్‌ విప్‌ సునిల్‌ ప్రభు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ బలపరీక్ష చట్ట విరుద్ధమని, దీనిపై తక్షణ విచారణ చేపట్టాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు.. ఈ సాయంత్రం 5 గంటలకు విచారించేందుకు అంగీకరించింది.

వరుస భేటీలు..

బలపరీక్ష నేపథ్యంలో ప్రభుత్వ భాగస్వామ్య పార్టీ అయిన ఎన్పీపీ నేడు కీలక సమావేశం నిర్వహించనుంది. పార్ట అధినేత శరద్‌ పవార్‌ నివాసంలో ఎన్సీపీ ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు. అటు భాజపా కూడా ఈ మధ్యాహ్నం తమ ఎమ్మెల్యేలతో సమావేశం కానుంది. విశ్వాస పరీక్ష నేపథ్యంలో ఎమ్మెల్యేలంతా రేపు తప్పకుండా అసెంబ్లీ సమావేశానికి హాజరుకావాలని ఆయా పార్టీలు తమ సభ్యులను ఆదేశించే అవకాశముంది.

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో నిన్న రాత్రి భాజపా నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ గవర్నర్‌ను కలిశారు. బలపరీక్షకు సీఎంను ఆదేశించాలని కోరారు. 39 మంది శివసేన ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారనీ, సర్కారు మైనారిటీలో పడిందని రాసిన లేఖను ఆయనకు అందజేశారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్‌.. బలాన్ని నిరూపించుకోవాలని ఠాక్రే సర్కారును ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని