మోదీ చూపిన శ్రద్ధ మరువలేనిది: చిరాగ్

బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్ తన ప్రభుత్వ పనితీరుపై రిపోర్ట్ కార్డు ఇవ్వాలంటూ లోక్‌ జనశక్తి పార్టీ అధినేత చిరాగ్ పాసవాన్ లేఖ ద్వారా డిమాండ్ చేశారు

Published : 03 Nov 2020 00:47 IST

పట్నా: ప్రభుత్వ పనితీరుపై బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్ రిపోర్ట్ కార్డు ప్రజల ముందుంచాలంటూ లోక్‌ జనశక్తి పార్టీ అధినేత చిరాగ్ పాసవాన్ లేఖ ద్వారా డిమాండ్ చేశారు. 15 సంవత్సరాల పాటు ‘సుశాసన్ బాబు’గా ప్రచారం పొందిన నితీశ్ అవినీతి బట్టబయలవుతోందని విమర్శించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల తరుణంలో ఆయన నితీశ్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

‘నితీశ్ ‘సుశాసన్ బాబు’ ట్యాగ్‌తో 15 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. కానీ, ఆయన దోపిడీ ఇప్పుడు బహిర్గతం అవుతోంది. ముంగర్ ఘటన గురించి ఆయన ఎప్పుడు ఒక్కమాట మాట్లాడలేదు. అవినీతి గురించి ప్రస్తావనే లేదు. లాలూ ప్రసాద్ యాదవ్‌ ప్రభుత్వంపై విమర్శలు చేసి అధికారంలోకి వచ్చిన ఆయన, 2015లో వారితోనే జట్టుకట్టి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు’ అంటూ విమర్శలు చేశారు. జేడీయూ ప్రభుత్వ పనితీరుకు సంబంధించి రిపోర్టు కార్డు ఇవ్వాలంటూ నితీశ్‌ను చిరాగ్ లేఖ ద్వారా డిమాండ్ చేశారు. మరోవైపు, తన తండ్రి రాంవిలాస్‌ పాసవాన్ చివరి రోజుల్లో ప్రధాని మోదీ చూపిన శ్రద్ధ పట్ల ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటీవల అనారోగ్యంతో రాంవిలాస్‌ పాసవాన్‌ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అలాగే, కొద్దిరోజుల క్రితం లీకైన వీడియో గురించి మాట్లాడుతూ..తన తండ్రి మరణాన్ని తాను లెక్క చేయలేదంటూ కొందరు నా పేరును దెబ్బతీయాలనుకున్నారని మండిప్డడారు.  ఇదిలా ఉండగా, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన చిరాగ్..అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఒకవైపు నితీశ్ కుమార్‌పై విమర్శలు చేస్తూ..ప్రధాని మోదీకి అభిమానినంటూ చెప్పుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని