Chandrababu: తెదేపా హయాంలో మాత్రమే రంజాన్‌ కానుక: చంద్రబాబు

ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం వైకాపా ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు అమలు చేయటం లేదని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు...

Updated : 29 Apr 2022 22:26 IST

గుంటూరు: ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం వైకాపా ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు అమలు చేయటం లేదని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. గుంటూరులోని బి.కన్వెన్షన్‌ సెంటర్‌లో తెదేపా ఆధ్వర్యంలో ముస్లింలకు ఇచ్చిన ఇఫ్తార్‌ విందుకు చంద్రబాబు హాజరయ్యారు. ముస్లిం సంప్రదాయ టోపీ ధరించి ప్రార్థనల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెదేపా హయాంలో ముస్లింల కోసం ప్రత్యేకంగా బడ్జెట్‌లో నిధులు కేటాయించిన విషయం గుర్తు చేశారు. ముస్లిం సోదరులు హజ్‌ యాత్రకు వెళ్లేందుకు ఇబ్బందులు లేకుండా హైదరాబాద్‌లో హజ్‌హౌస్‌ కట్టించామన్నారు. కల్యాణ మండపాలు, కబరస్తాన్‌లు కట్టించామని, పేద ముస్లిం యువతుల వివాహానికి ఆర్థిక సాయం చేశామని వివరించారు. రంజాన్‌ కానుక తెదేపా హయాంలో మాత్రమే ఇచ్చామని తెలిపారు. రాష్ట్ర ప్రజలను కాపాడటం కోసం తాను పోరాడుతానని ఈ సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... మైనార్టీల కోసం తెదేపా ప్రభుత్వం ఎంతో చేసిందన్నారు. ఇఫ్తార్‌ విందుకు వచ్చిన చంద్రబాబుకు తెదేపా ముస్లిం కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. భారీ గజమాలను క్రేన్‌ సాయంతో తెచ్చి అలంకరించారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌, మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌, తెనాలి శ్రావణ్ కుమార్‌, తెదేపా నాయకులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని