Andhra News: ‘అమ్మఒడి’ ఇవ్వాల్సి వస్తుందనే ఎక్కువ మందిని ఫెయిల్‌ చేశారు: కనకమేడల

తెదేపా మహానాడుకు వచ్చిన స్పందన చూసి భయంతోనే అధికార పార్టీ వైకాపా వర్క్‌షాప్‌ నిర్వహించిందని తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ అన్నారు.

Updated : 09 Jun 2022 16:04 IST

అమరావతి: తెదేపా మహానాడుకు వచ్చిన స్పందన చూసి భయంతోనే అధికార పార్టీ వైకాపా వర్క్‌షాప్‌ నిర్వహించిందని తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ అన్నారు. పార్టీని కాపాడుకోవడానికే వర్క్‌షాప్‌, ప్లీనరీలు ఏర్పాటు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అధికార పార్టీ ఎమ్మెల్యేలు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అమరావతిలో కనకమేడల మీడియాతో మాట్లాడారు. నిన్న నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఎమ్మెల్యేలు లేవనెత్తిన సందేహాలకు సీఎం జగన్‌ సమాధానాలు చెప్పలేకపోయారని ఎద్దేవా చేశారు. ప్రజల మీద తిరగబడమని శాసనసభ్యులను సీఎం రెచ్చగొడుతున్నారని కనకమేడల ఆరోపించారు. ప్రజల సమస్యలకు జగన్‌ పరిష్కార మార్గాలు చెప్పలేకపోయారన్నారు.

అమ్మఒడి పథకం ఇవ్వడం ఇష్టం లేకే..

కేంద్రం దయతలిస్తే తప్ప రాష్ట్ర ప్రభుత్వం మనుగడ సాధించలేదని భాజపా నేతలు ప్రకటించిన తర్వాత కూడా వైకాపా నేతలు స్పందించలేదన్నారు. రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ లేదని సాక్షాత్తూ కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారని గుర్తు చేశారు. జగన్‌ ఇటీవల దిల్లీ వెళ్లి ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసి ఏం మాట్లాడారో చెప్పలేదన్నారు. పదో తరగతి పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందని విమర్శించారు. అమ్మఒడి పథకం అమలు ఇష్టం లేకే రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పరీక్షల్లో చాలా మందని ఫెయిల్‌ చేశారని కనకమేడల ఆరోపించారు. నిన్నటి వర్క్‌షాప్‌లో ఈ అంశాన్ని ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ పనితీరు ఘోరంగా ఉందని.. మంత్రికి కనీస అవగాహన లేదన్నారు. 

అమరావతి రాజధానికి కోర్టు విధించిన కాలపరిమితి ఎత్తివేయాలని కోర్టును కోరుతున్నారని.. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క భవనం అయినా కట్టారా?అని నిలదీశారు. తెదేపా హయాంలో నిర్మించిన భవనాల్లో ప్రస్తుత ప్రభుత్వం నడుస్తోందని వివరించారు.

అదే పంథా..
రాష్ట్రంలో శాంతిభద్రతలు ఘోర వైఫల్యం చెందాయని.. వీటి గురించి అధికార పార్టీ నేతలు ఎప్పుడైనా మాట్లాడుతున్నారా అని కనకమేడల ప్రశ్నించారు. మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసుపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ విచారణ కోరిన వైకాపా నేతలు అధికారంలోకి వచ్చాక అవసరం లేదన్నారని ఆయన గుర్తు చేశారు. ఈ హత్య కేసులో ప్రమేయం ఉన్న గంగాధర్ అనుమానాస్పదంగా మృతి చెందారని తెలిపారు.  పరిటాల హత్యకేసులో సాక్షులు చనిపోయారని.. అదే పంథా వివేకా కేసులోనూ జరుగుతోందన్నారు.

వైకాపాకు చట్టం చుట్టమైంది..
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత 5.18శాతం భౌతిక దాడులు పెరిగాయని.. 
సెంట్రల్ క్రైమ్ బ్యూరో రికార్డ్ ప్రకారం నేరాల్లో ఆంధ్రప్రదేశ్ ముందుందని కనకమేడల వివరించారు. గంజాయి సరఫరాలో కూడా ఏపీ ముందుందని చెప్పారు. సామాజిక మాధ్యమంలో ఒక పోస్టు పెడితే ఒక మహిళా నేతను ఎనిమిది గంటలు ప్రశ్నిస్తారా అని నిలదీశారు. ఒక దళిత యువకుడిని హత్య చేసి ఇంటికి తీసుకొచ్చి శవాన్ని తీసుకోవాలని బలవంత పెట్టిన నాయకుడిపై కేసు నమోదు చేయడానికి రెండు రోజులు తీసుకుంటారా అని కనకమేడల ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టం చుట్టమై వైకాపా నేతలను రక్షిస్తూ.. తెదేపా నేతలను శిక్షిస్తోంది. తెదేపా నేతలు, మాజీ మంత్రులు చేసిన ఒక్క ఫిర్యాదుపై కూడా పోలీసులు స్పందించడం లేదని కనకమేడల మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని