AP News: పార్లమెంట్‌ సాక్షిగా ఏపీ పరువు తీశారు: తెదేపా ఎంపీల ఆగ్రహం

పార్లమెంట్‌ సాక్షిగా వైకాపా ఎంపీలు రాష్ట్రం పరువు తీశారని తెదేపా ఎంపీలు కనకమేడల రవీంద్ర కుమార్‌, రామ్మోహన్‌ నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో

Updated : 10 Aug 2022 15:28 IST

దిల్లీ: పార్లమెంట్‌ సాక్షిగా వైకాపా ఎంపీలు రాష్ట్రం పరువు తీశారని తెదేపా ఎంపీలు కనకమేడల రవీంద్ర కుమార్‌, రామ్మోహన్‌ నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉందని, జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఉందని చెప్పి రాష్ట్ర ఖ్యాతిని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. వైకాపా అధికారంలోకి వచ్చాక రూ.లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందన్నారు. దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల మాట్లాడుతూ.. ఏపీ ఆర్థిక సంక్షోభంలో ఉంది.. మేం జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నామంటూ వైకాపా ఎంపీ భరత్‌ లోక్‌సభలో చెప్పడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు. మరో సభ్యుడు రఘురామ కృష్ణరాజు .. రాష్ట్రం సంక్షోభంలో మునిగిపోతోంది.. రక్షించండంటూ జీరో అవర్‌లో ప్రస్తావించారని పేర్కొన్నారు. 

ప్రత్యేక హోదా ఎప్పుడు తెస్తారు?: రామ్మోహన్‌ నాయుడు

శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌ నాయుడు మాట్లాడుతూ.. ‘‘ఏపీ సీఎం జగన్‌, వైకాపా ఎంపీలందరికీ నాదొక సూటి ప్రశ్న. ప్రత్యేక హోదా ఎప్పుడు తీసుకొని వస్తారు? ఎలా పోరాటం చేస్తున్నారు?. ఈ రెండున్నరేళ్లలో  ఒక్క సెషన్‌లో గానీ, ఒక్కరోజైనా కేంద్రం ఇచ్చిన హామీల కోసం, ఏపీ పునర్విభజన చట్టం ద్వారా మనకు రావాల్సిన నిధుల కోసం దిల్లీలో ఏదైనా పోరాటం చేశారా? ఓట్ల కోసం ప్రజలకు ఇచ్చిన హామీలను తాకట్టు పెట్టి ఒక్కరు కూడా ప్రత్యేక హోదా గురించి గానీ, రాష్ట్రానికి రావాల్సి నిధులు గురించి గానీ, ఉత్తరాంధ్రకు రావాల్సిన రైల్వే జోన్‌గురించి గానీ.. ఇలా ఎన్నో అంశాలు ఇంకా పెండింగ్‌లో ఉంటే ఒక్క మాట కూడా మాట్లాడకపోవడానికి కారణమేంటని అడుగుతున్నాం’’ అని రామ్మోహన్‌ నాయుడు ప్రశ్నించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని