Telangana Congress: పార్లమెంట్ అందరిదీ.. మోదీయే పార్లమెంట్‌లా వ్యవహరిస్తున్నారు: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

పార్లమెంట్‌ ఏవిధంగా ఉండాలో ఆర్టికల్‌ 79 స్పష్టంగా వివరించిందని కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమారెడ్డి అన్నారు. పార్లమెంట్‌ వ్యవస్థలో రాష్ట్రపతి, లోక్‌సభ, రాజ్యసభ ఉంటాయన్నారు. 

Updated : 26 May 2023 18:12 IST

హైదరాబాద్: పార్లమెంట్‌ ఏవిధంగా ఉండాలో ఆర్టికల్‌ 79 స్పష్టంగా వివరించిందని కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమారెడ్డి అన్నారు. పార్లమెంట్‌ వ్యవస్థలో రాష్ట్రపతి, లోక్‌సభ, రాజ్యసభ ఉంటాయన్నారు. పార్టీ సీనియర్ నేతలతో సమావేశం అనంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్‌ సమావేశాలకు అతి తక్కువ రోజులు హాజరైన ప్రధానమంత్రులలో నరేంద్ర మోదీ మొదటి స్థానంలో ఉన్నారన్నారు. పార్లమెంట్ అందరిదీ.. మోదీయే పార్లమెంట్‌లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నూతన పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ ఎంపీలు హాజరు కావడం లేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తేల్చి చెప్పారు.

సీఎం మూతి పగిలే తీర్పు ఇస్తారు: మధుయాష్కీ

‘‘ప్రతి నెల మొదటి వారంలో పీఏసీ సమావేశాలు నిర్వహిస్తాం. జూన్ 2 నుంచి భారాస వైఫల్యాలపై 20 రోజుల కార్యక్రమం చేపడతాం. ప్రతి మండల కేంద్రంలో పార్టీ జెండా, జాతీయ జెండా ఎగురవేస్తాం. ఈ 20 రోజులు పార్టీ కార్యకర్తలు తమ ఇంటిపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి. 20 రోజుల కార్యక్రమంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను ఆహ్వానించాలని నిర్ణయించాం. ‘బీసీ గర్జన’ సభ నిర్వహిస్తాం. 30 శాతం కమీషన్ తీసుకునే ముఖ్యమంత్రికి మూతి పలిగేలా ప్రజలే తీర్పు ఇస్తారు’’ అని పేర్కొన్నారు.

ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధానం: శ్రీధర్ బాబు

‘‘హిమాచల్‌ప్రదేశ్‌, కర్ణాటక ఎన్నికల ఫలితాలతో ప్రజలు తమ నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పారు. 20 రోజుల కార్యక్రమాల్లో భారాస వైఫల్యాలను ఎండగడతాం. రెండు రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తాం. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధానం ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్ సీఎం మాట్లాడిన దాంట్లో తప్పేముంది? కేసీఆర్ మహారాష్ట్రకు వెళ్లి మాట్లాడితే తప్పులేదు కానీ, హిమాచల్‌ సీఎం ఇక్కడకు వచ్చి మాట్లాడితే తప్పా’’ అని ప్రశ్నించారు.

భాజపా వాళ్లు ఎప్పుడు మారుతారో..: వీహెచ్ 

‘‘తెలంగాణ ఇచ్చింది.. తెచ్చింది కాంగ్రెస్‌. ఈ భాజపా వాళ్లు ఎప్పుడేం మాట్లాడుతారో అర్థం కావడం లేదు. నిజాంకు వ్యతిరేకం అని చెప్పుకొనే భాజపా.. గోల్కొండ కోట మీద జెండా ఎగురవేస్తాం అంటే నవ్వొస్తుంది. పంజాగుట్టలో నేను అంబేడ్కర్ విగ్రహం పెట్టాలని కొట్లాడితే.. నాకు ఎక్కడ పేరు వస్తుందోనని భారాస నేతలు ఏర్పాటు చేశారు’’ అని వీహెచ్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని