Akhilesh Yadav: యోగీ.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి!

ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి వేగం పుంజుకుందంటూ యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారంపై సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్‌ యాదవ్......

Published : 08 Dec 2021 01:42 IST

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి వేగం పుంజుకుందంటూ యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారంపై సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్‌ యాదవ్ మండిపడ్డారు. ప్రజల ఆగ్రహాన్ని చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో భాజపా 400లకు పైగా స్థానాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా గెలువలేకపోవచ్చని అంచనా వేశారు. అంతేకాకుండా పశ్చిమ యూపీలో భాజపా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో తాజా రాజకీయాలపై రాష్ట్రీయ లోక్‌దళ్‌ (RLD) చీఫ్‌ జయంత్‌ చౌధురితో చర్చించిన అనంతరం.. అఖిలేశ్‌ యాదవ్‌ ఈ విధంగా స్పందించారు.

రాష్ట్రంలో ఉద్యోగాలు, విద్యారంగం అభివృద్ధి, రైతుల సమస్యలపై యోగి ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలపై అఖిలేశ్‌ యాదవ్‌ విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా లఖింపూర్‌ ఖేరీ ఘటన సమయంలో కేంద్రమంత్రి కుమారుడు ఆ వాహనంలో కూర్చున్నాడా? లేదా? అనే ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా యోగిపై ఎన్ని కేసులున్నాయి? ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటిలో ఎన్ని తొలగించారనే ప్రశ్నకు సమాధానం చెప్పాలని ఓ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఖిలేశ్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత 70లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని యోగి ఆదిత్యనాథ్‌ వాగ్దానం చేశారని.. కానీ ఇప్పటివరకు 4లక్షల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని రాష్ట్రీయ లోక్‌దళ్‌ అధినేత జయంత్‌ చౌధురి దుయ్యబట్టారు. ఈ లెక్కలు వారు అధికారికంగా ప్రచారం చేసుకుంటున్న పోస్టర్లే చెబుతున్నాయని గుర్తుచేశారు.

ఇదిలాఉంటే, ఉత్తర్‌ప్రదేశ్‌ మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 2017 ఎన్నికల్లో 312 సీట్లలో భాజపా గెలుపొందింది. అంతకుముందు అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) కేవలం 44 సీట్లు మాత్రమే సాధించింది. బీఎస్‌పీ మాత్రం ఒక్క సీటుకే పరిమితమైంది. వచ్చే ఏడాది ప్రారంభంలో అక్కడ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను రచిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని