Alternative to BJP: భాజపాకు ప్రత్యామ్నాయం వారి చేతుల్లోనే..!

దేశంలో భాజపా ప్రాబల్యాన్ని ఎదుర్కొనేందుకు బలమైన ప్రతిపక్షం ఎవరనే విషయాన్ని ప్రజలే నిర్ణయిస్తారు తప్ప మరెవరి నిర్ణయం వల్ల కాదని సీపీఎం జనరల్‌ సెక్రటరీ సీతారాం ఏచూరి అభిప్రాయపడ్డారు.

Published : 26 Oct 2021 01:35 IST

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి

దిల్లీ: దేశంలో భాజపా ప్రాబల్యాన్ని ఎదుర్కొనేందుకు బలమైన ప్రతిపక్షం ఎవరనే విషయాన్ని ప్రజలే నిర్ణయిస్తారు తప్ప మరెవరి నిర్ణయం వల్ల కాదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అభిప్రాయపడ్డారు. ఇందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యామ్నాయం అనే విషయాన్ని ఇటీవల జరిగిన పార్టీ కేంద్ర కమిటీ సమావేశంలో చర్చించలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తోనూ కలిసి పనిచేసే విషయంపైనా చర్చించలేదన్న ఆయన.. భాజపా వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొనే ఎన్నికల సమయంలో ఎన్నో కూటములు (ఫ్రంట్‌లు) బలపడిన విషయాన్ని గుర్తుచేశారు.

సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు మూడు రోజుల పాటు దిల్లీలో జరిగాయి. ఇందులో భాగంగా పార్టీ రాజకీయ నిర్ణయాలు, కాంగ్రెస్‌ పార్టీతో సంబంధంపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా భాజపాకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌ కాదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కూడా అభిప్రాయపడినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే, దేశంలో ఎమర్జెన్సీ తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి ప్రత్యామ్నాయంగా జనతా పార్టీ ఏర్పడిన తీరును.. తర్వాత యూపీఏ ఏర్పాటును ఏచూరి ఉదహరించారు. ఇలా ప్రత్యామ్నాయాలు ఎప్పుడూ ప్రజల చేతుల్లోనే ఉంటాయని ఏచూరి స్పష్టం చేశారు. గతంలో ఎన్నికల సమయంలో ఏర్పడిన కూటములన్నీ భాజపా వ్యతిరేక దృష్టితోనే బలపడ్డాయని సీతారాం ఏచూరి అభిప్రాయపడ్డారు.

ధరల పెరుగుదలపై మండిపాటు..

దేశంలో రికార్డు స్థాయిలో పెరిగిపోతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలపైనా సీతారాం ఆందోళన వ్యక్తం చేశారు. ఇక 100 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ మైలురాయిపై మాట్లాడిన సీతారం ఏచూరి.. వ్యాక్సిన్‌లను ఉచితంగా ఇచ్చేందుకే పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచుతున్నట్లు ఓ కేంద్ర మంత్రి పేర్కొనడంపై తీవ్రంగా మండిపడ్డారు. వ్యాక్సినేషన్‌ కోసం బడ్జెట్‌లో కేటాయించిన రూ.35వేల కోట్లు నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోవడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం.. కేవలం ప్రజల దృష్టి మరల్చడానికే ప్రధాని మోదీ 100 కోట్ల డోసుల సంబరాలను నిర్వహించారని విమర్శించారు. ఆలస్యమైనప్పటికీ దేశంలో వందకోట్ల డోసులను పంపిణీ చేయడం అభినందించాల్సిన విషయమన్నారు. ఇదే సమయంలో దేశంలో కేవలం 21 శాతం మంది మాత్రమే పూర్తి మోతాదులో వ్యాక్సిన్‌ అందుకున్న విషయాన్ని గమనించాలని గుర్తుచేశారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న జనాభా లెక్కలతోపాటే కులగణన చేపట్టాలని సీతారాం ఏచూరి డిమాండ్‌ చేశారు. పార్టీ కేంద్ర కమిటీ కూడా ఇదే విషయాన్ని డిమాండ్‌ చేసిందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని