Raghunandan Rao: జాతీయ పార్టీలను తిట్టే తెరాసకు దిల్లీలో భవన్ ఎందుకు?

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభమై ఐదు రోజులు గడవకముందే తెరాస నేతల్లో భయం మొదలైందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు అన్నారు. హైదరాబాద్‌లోని..

Published : 02 Sep 2021 01:14 IST

హైదరాబాద్‌: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభమై ఐదు రోజులు గడవకముందే తెరాస నేతల్లో భయం మొదలైందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు అన్నారు. హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. బండి పాదయాత్రలో పార్టీ కార్యకర్తలు తప్పితే ప్రజలు లేరని తెరాస నేతలు విమర్శిస్తున్నారని.. జనంలేని పాదయాత్ర గురించి తెరాస నేతలెందుకు భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశారు. దిల్లీకి బానిసలమైతే.. దిల్లీలో తెరాసకు పార్టీ కార్యాలయం ఎందుకు? దిల్లీకి బానిసలయ్యేందుకే తెరాస భవన్ నిర్మించాలనుకున్నారా? జాతీయ పార్టీలను తిట్టే తెరాసకు దిల్లీలో భవన్ ఎందుకు ?అని నిలదీశారు.

‘‘సర్దార్ వల్లభాయ్ పటేల్ చరిత్రను తెలుసుకొని తెరాస ఎమ్మెల్యేలు మాట్లాడాలి. ఆయన భాజపాకు సంబంధించిన వ్యక్తి కాదు. చివరకు పటేల్‌కు సైతం ప్రాంతీయ తత్వాన్ని అంటగట్టిన ఘనత తెరాసకే దక్కుతుంది. దేశంలో నిజాం వారసులు ఎక్కడ ఉన్నారనే విషయాన్ని అసెంబ్లీలో ప్రశ్నిస్తాం. 111జీవో మీద సీఎం కేసీఆర్‌ తన వైఖరిని స్పష్టంగా చెప్పాలి. చార్మినార్, గోల్కొండ.. ఇలా ఎక్కడినుంచి అయినా మేం మాట్లాడుతాం. తెరాస ఎమ్మెల్యేలు రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలి. దేశానికి, జాతీయ వాదానికి భాజపా బానిస. కేంద్రం నిధులు ఇస్తుంటే.. ఏమిచ్చిందని తెరాస నేతలు ప్రశ్నిస్తున్నారు. బండి సంజయ్ పాదయాత్ర ముగిసేలోగా రాష్ట్రంలో పీఠాలు కదలడం ఖాయం’’ అని రఘునందన్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని