AP News: పవన్‌ను ధైర్యంగా ఎదుర్కోలేకే వ్యక్తిగతంగా..: నాదెండ్ల మనోహర్‌

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై వైకాపా నేతలు విమర్శలు చేస్తున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల

Updated : 29 Sep 2021 14:07 IST

మంగళగిరి: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై వైకాపా నేతలు విమర్శలు చేస్తున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. పవన్‌ను ధైర్యంగా ఎదుర్కోలేకే వ్యక్తిగతంగా టార్గెట్‌ చేస్తున్నారని ఆరోపించారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మనోహర్‌ మాట్లాడారు. ‘రిపబ్లిక్‌ ’ సినిమా ప్రీరిలీజ్‌ వేడుకలో పవన్‌ ఏం మాట్లాడారో ఒకసారి చూడాలని వైకాపా నేతలకు ఆయన హితవు పలికారు. సినీ పరిశ్రమకు కాపాడమంటే పవన్‌ను కాపాడాలని కాదన్నారు. సినీ కార్మికులను దృష్టిలో ఉంచుకోవాలని కోరారని మనోహర్‌ చెప్పారు. వైకాపా ప్రభుత్వ నిర్ణయాలు, గతంలో చేసిన వాగ్దానాలపైనే మాట్లాడారని.. దానిపై ఎందుకు సమాధానం చెప్పరు? అని నిలదీశారు.

జగన్‌ ఇప్పుడు పాదయాత్ర చేయాలి!

‘‘పవన్‌ను ధైర్యంగా ఎదుర్కోలేకే సినిమా వాళ్లను వాడుకుంటున్నారు. ప్రజాసమస్యలపై పోరాటం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. 151 మంది ఎమ్మెల్యేలను ఇస్తే రాష్ట్రానికి ఏం చేశారు. జగన్‌ ఇప్పుడు పాదయాత్ర చేయాలి. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిని కళ్లారా చూడాలి. కొవిడ్‌ సమయంలో ఏ ఆస్పత్రికైనా జగన్‌ వెళ్లారా? దేశంలో కొవిడ్‌ మరణాల్లో ఏపీ నాలుగో స్థానంలో నిలిచింది. ప్రతి కుటుంబం నుంచీ ఓ వ్యక్తిని కోల్పోయాం. ప్రభుత్వం సరైన రీతిలో వ్యవహరించకపోవడం వల్లే నష్టాలు జరిగాయి.

పవన్‌ పదవి కోసం పాకులాడే వ్యక్తి కాదు

జనసైనికులపై అన్యాయంగా కేసులు పెడుతున్నారు. ఆ కేసులను ఎదుర్కొనేందుకు పార్టీ తరఫున లీగల్‌ సెల్‌ ఏర్పాటు చేశాం. రాబోయే రోజుల్లో ఎక్కడ ఎలాంటి సమస్యలు వచ్చినా ధైర్యంగా లీగల్‌ సెల్‌కు ఫోన్‌ చేయొచ్చు. కార్యకర్తలకు వాళ్లు అండగా ఉంటారు. పవన్‌ పదవి కోసం పాకులాడే వ్యక్తి కాదు. నిజాయతీగా ప్రజల కోసం పోరాడే వ్యక్తి. జగన్‌ కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారు. ఓటు బ్యాంకు కోసం అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడ మనమే బలమైన ప్రతిపక్షం. ఒక్కసారిగా జనసేన ఎదుగుతోందని భయపడి ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారు. అంత అవసరం ఉందా? రాజకీయ పార్టీలు తమ విధానాలు, మేనిఫెస్టోలు చెప్పుకుంటాయి. కానీ.. కావాలని పవన్‌పై వ్యక్తిగతంగా ప్రభుత్వం దాడి చేయడం చాలా బాధాకరం. ఈ విషయలో జన సైనికులు సంయమనం పాటించాలి’’ అని నాదెండ్ల మనోహర్‌ సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని