Jayaram Komati: ఎన్టీఆర్ విగ్రహధ్వంసం ఘటనను ఖండించిన ఎన్నారై జయరాం కోమటి

ఎన్టీఆర్‌ విగ్రహ ధ్వంసం ఘటనను ప్రవాసాంధ్రుడు జయరాం కోమటి ఖండించారు. 

Updated : 04 Jan 2022 00:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్‌ విగ్రహన్ని వైకాపా కార్యకర్త ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన సంగతి సంచలనమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనను రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నేతలు, కార్యకర్తలతోపాటు ఎన్నారై తెదేపా నేతలు కూడా ఖండిస్తున్నారు. అమెరికాలో ప్రముఖ ప్రవాసాంధ్రుడు, తెదేపా నేత, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రతినిధి, తానా మాజీ అధ్యక్షుడు జయరాం కోమటి ఈఘటనను తీవ్రంగా ఖండించారు. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన అన్నగారి విగ్రహంపై ఈ అమానుష ఘటన దారుణమని మండిపడ్డారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.


గుంటూరు జిల్లాలోని మండల కేంద్రం దుర్గి బస్టాండ్‌ కూడలిలో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహాన్ని వైకాపా నాయకుడు, దుర్గి జడ్పీటీసీ సభ్యుడు శెట్టిపల్లి యల్లమంద కుమారుడు కోటేశ్వరరావు ఆదివారం సుత్తితో విగ్రహంపై పలుమార్లు కొట్టాడు. దీంతో విగ్రహం పలుచోట్ల దెబ్బతింది. స్థానికులు కోటేశ్వరరావును అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమై సంఘటన స్థలంలో గుమికూడిన తెదేపా, వైకాపా శ్రేణులను చెదరగొట్టారు. విగ్రహం దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్‌ విగ్రహంపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెదేపా మాచర్ల నియోజకవర్గ బాధ్యుడు బ్రహ్మారెడ్డి డిమాండు చేశారు. ఈ ఘటనపై గుంటూరు రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్నీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటేశ్వరరావును స్థానిక పోలీసులు అరెస్టు చేశారని పేర్కొన్నారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని గురజాల డీఎస్పీని ఆదేశించినట్లు వెల్లడించారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని