NTR: ఆడపడుచులను అనడం అరాచక పాలనకు నాంది: ఎన్టీఆర్‌

ప్రజా సమస్యలను పక్కన పెట్టి, వ్యక్తిగత దూషణలకు, అదీ ఆడపడుచుల గురించి పరుష పదజాలంతో మాట్లాడటం

Updated : 20 Nov 2021 16:22 IST

హైదరాబాద్‌: ప్రజా సమస్యలను పక్కన పెట్టి, వ్యక్తిగత దూషణలకు, అదీ ఆడపడుచుల గురించి పరుష పదజాలంతో మాట్లాడటం ఒక అరాచక పాలనకు నాంది అని నటుడు జూ.ఎన్టీఆర్‌ అన్నారు. ఏపీ అసెంబ్లీలో ప్రతి పక్షనేత, తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరిపై పలువురు నాయకులు వ్యక్తిగత విమర్శలు చేయడం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై నందమూరి కుటుంబం విలేకరులతో మాట్లాడింది. తాజాగా ఎన్టీఆర్‌ ట్విటర్‌ వేదికగా ప్రత్యేక వీడియోను షేర్‌ చేస్తూ, మహిళలను కించపరుస్తూ మాట్లాడిన వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

‘‘అందరికీ నమస్కారం. మాట మన వ్యక్తిత్వానికి ప్రమాణం. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు చాలా సర్వ సాధారణం. అవి ప్రజా సమస్యలపై జరగాలే కానీ, వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత విమర్శలుగా ఉండకూడదు. నిన్న ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటన నా మనసును కలచి వేసింది. ఎప్పుడైతే మనం ప్రజా సమస్యలను పక్కన పెట్టి, వ్యక్తిగత దూషణలకు దిగుతున్నామో, ముఖ్యంగా మన ఆడపడుచుల గురించి పరుష పదజాలంతో మాట్లాడుతున్నామో అది ఒక అరాచక పాలనకు నాంది పలుకుంది. స్త్రీ జాతిని గౌరవించటం అనేది మన సంస్కృతి. మన నవ నాడుల్లో, మన జవ జీవాల్లో మన రక్తంలో ఇమిడిపోయిన ఒక సంప్రదాయం. దాన్ని రాబోయే తరాలకు జాగ్రత్తగా అప్పగించాలి. అంతేకానీ, మన సంస్కృతిని కలచి వేసి, కాల్చేసి ఇదే రాబోయే తరాలకు  బంగారు బాట వేస్తున్నామనుకుంటే అది మన తప్పు. అది మనం చేసే చాలా పెద్ద తప్పు’’

‘‘ఈ మాటలు నేను ఒక వ్యక్తిగత దూషణకు గురైన కుటుంబానికి చెందిన సభ్యుడిగా మాట్లాడటం లేదు. ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా ఈ దేశానికి చెందిన ఒక పౌరుడిగా సాటి తెలుగువాడిగా మాట్లాడుతున్నా. రాజకీయ నాయకులకు ఒకటే విన్నపం. ఈ అరాచక సంస్కృతిని ఇక్కడే ఆపేయండి. ప్రజాసమస్యలపై పోరాడండి. రాబోయే తరానికి బంగారు బాట వేసేలా నడవడిక ఉండేలా జాగ్రత్త పడండి. ఇది నా విన్నపం మాత్రమే. ఇది ఇక్కడితో ఆగిపోతుందని మనసారా కోరుకుంటున్నా’’అని ఎన్టీఆర్‌ భావోద్వేగంతో మాట్లాడారు.

Read latest Political News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని