Railway zone: రైల్వేజోన్‌ సంగతేంటి?: లోక్‌సభలో గళమెత్తిన రామ్మోహన్‌ నాయుడు

దక్షిణకోస్తా రైల్వేజోన్‌ ఏర్పాటులో కేంద్రం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని తెదేపా ఎంపీ రామ్మోహన్‌ నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. 2019 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన

Published : 10 Dec 2021 01:30 IST

దిల్లీ: దక్షిణకోస్తా రైల్వేజోన్‌ ఏర్పాటులో కేంద్రం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని తెదేపా ఎంపీ రామ్మోహన్‌ నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. 2019 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన కొత్త జోన్‌ ఏర్పాటుపై ఇప్పటికీ పురోగతిలేదని లోక్‌సభలో గళమెత్తారు. మూడేళ్లు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం చొరవచూపడంలేదని మండిపడ్డారు. 2021-22 బడ్జెట్‌లో దక్షిణ కోస్తా రైల్వేజోన్‌కు కేవలం ₹40 లక్షలు మాత్రమే కేటాయించారనీ, ఆ డబ్బుతో భవనం నిర్మించడమే కష్టమన్నారు. ఇంత తక్కువ కేటాయించడం రాష్ట్రాన్ని అవమానించడమేనన్నారు. దేశంలో ప్రస్తుతం ఉన్న రైల్వే జోన్ల జాబితాలో గానీ, కొత్తగా ఏర్పాటు చేయబోయే జోన్ల జాబితాలో గానీ దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ అంశాన్ని కేంద్రం చేర్చలేదని మండిపడ్డారు. ఈ రెండు జాబితాలోనూ లేకపోవడంపై కేంద్రం స్పష్టత ఇవ్వాలన్నారు. రైల్వే జోన్‌ ఏర్పాటు, ఎంత బడ్జెట్‌ కేటాయిస్తున్నారో చెప్పాలని  ఏపీ ప్రజల తరఫున మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల తరఫున కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. వెంటనే రైల్వేజోన్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు.

రైల్వే జోన్‌పై వైకాపా ఎంపీల భిన్న స్వరం 

ఇకపోతే, ఇదే అంశంపై వైకాపా ఎంపీలు చెరో స్వరం వినిపించారు. విభజన చట్టం హామీల ప్రకారం కేంద్రం దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలని వైకాపా ఎంపీ మార్గాని భరత్‌ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అయితే, ఆ పార్టీకి చెందిన మరో ఎంపీ సత్యవతి  దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటు చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు అని చెప్పుకొచ్చారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని