Maharashtra Crisis: రౌత్‌ అందుకే అలా అన్నారు.. మెజార్టీ ఎవరిదో అసెంబ్లీలో తేలుతుంది: శరద్‌ పవార్‌

మహారాష్ట్రలో (Maharashtra) ఉత్కంఠ రేపుతున్న రాజకీయ పరిణామాలపై ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ (Sharad pawar) స్పందించారు. రాష్ట్రంలో మహా వికాస్ అఘాడి ప్రభుత్వ .....

Published : 24 Jun 2022 01:45 IST

ముంబయి: మహారాష్ట్రలో (Maharashtra crisis) ఉత్కంఠ రేపుతున్న రాజకీయ పరిణామాలపై ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ (Sharad pawar) స్పందించారు. రాష్ట్రంలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వ భవితవ్యం అసెంబ్లీలోనే తేలుతుందన్నారు. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ కూటమి బలమేంటో అసెంబ్లీలో జరిగే విశ్వాస పరీక్షలో రుజువవుతుందని చెప్పారు. ముంబయిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పడిన సంక్షోభంలో భాజపా పాత్ర ఉందన్నారు.

‘‘మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వ భవితవ్యం గువాహటిలో (రెబల్‌ ఎమ్మెల్యేలు శిబిరం ఏర్పాటుచేసిన ప్రాంతం) కాదు.. అసెంబ్లీలోనే తేలుతుంది. ప్రభుత్వం అసెంబ్లీలో మెజార్టీని నిరూపించుకోవాల్సి ఉంటుంది’’ అని పవార్ అన్నారు. శివసేనలో తిరుగుబాటు వెనుక భాజపా పాత్ర లేదంటూ డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవించడంలేదన్నారు. మహారాష్ట్ర వెలుపలి నుంచి వచ్చిన భాజపా నేతల గురించి అజిత్‌ పవార్‌కు తెలియనందున ఆయన అలా మాట్లాడి ఉండొచ్చని, కానీ వాళ్ల గురించి తనకు తెలుసన్నారు. రెబల్‌ ఎమ్మెల్యేలకు సారథ్యం వహిస్తున్న ఏక్‌నాథ్‌ శిందే కూడా ఒక ప్రముఖ జాతీయ పార్టీ తమకు అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చిందని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా పవార్‌ ఉటంకించారు. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరచడంలో ఇతర జాతీయ పార్టీలైన బీఎస్పీ, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్‌, ఎన్సీపీలకు ఎలాంటి పాత్ర లేనందున.. శిందే భాజపాను ఉద్దేశించే అలా అన్నారని పవార్‌ వ్యాఖ్యానించారు.

తిరుగుబాటు చేసిన శివసేన ఎమ్మెల్యేలంతా ముంబయికి తిరిగి వచ్చి అసెంబ్లీని ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఆ సమయంలో గుజరాత్‌, అస్సాంకు చెందిన భాజపా నేతలు మార్గనిర్దేశం చేసేందుకు ఇక్కడ ఉండరన్నారు. అలాగే, తమ నియోజకవర్గాలకు ఆర్థిక శాఖ నుంచి నిధులు మంజూరు చేసుకొనేందుకు కూడా తాము ఇబ్బంది పడుతున్నామంటూ కొందరు రెబల్‌ ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణల్ని పవార్‌ తోసిపుచ్చారు. అవన్నీ కుంటిసాకులేనని.. వీరిలో కొందరు ఎమ్మెల్యేలు కేంద్ర సంస్థల విచారణ ఎదుర్కొంటున్నారని చెప్పారు. తిరుగుబావుటా ఎగురవేసిన ఎమ్మెల్యేలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. 1990లలో ఛగన్‌ భుజ్‌బల్‌ శివసేన నుంచి కాంగ్రెస్‌లో చేరేందుకు పార్టీ ఫిరాయించినప్పుడు ఒక్కరు తప్ప అందరూ ఓటమిపాలైన విషయాన్ని ఈ సందర్భంగా పవార్‌ గుర్తు చేశారు. ఇప్పుడు తిరుగుబాటు చేసిన నేతలకూ అలాంటి పరిస్థితే ఎదురవుతుందని హెచ్చరించారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా 24 గంటల్లో ముంబయికి చేరుకుంటే.. మహా వికాస్‌ అఘాడీ సర్కార్‌ నుంచి వైదొలగడంపై ఆలోచిస్తామంటూ శివసేన నేత సంజయ్‌ రౌత్‌ చేసిన ప్రకటనపైనా పవార్‌ స్పందించారు. వాళ్లందరినీ తిరిగి ముంబయికి తీసుకొచ్చేందుకే ఆయన ఆ ప్రకటన చేశారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని