Bypolls: ఉప ఎన్నికల్లో తృణమూల్‌, కాంగ్రెస్‌, ఆర్జేడీ సత్తా.. ఐదు చోట్లా భాజపాకు షాక్‌!

Bypolls: దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల పరిధిలో ఒక లోక్‌సభ, నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఒక్కచోట మినహా అన్నిచోట్లా అధికార పార్టీలకే ఓటర్లు పట్టం కట్టారు.

Published : 16 Apr 2022 20:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల పరిధిలో ఒక లోక్‌సభ, నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఒక్కచోట మినహా అన్నిచోట్లా అధికార పార్టీలకే ఓటర్లు పట్టం కట్టారు. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించగా.. ఒక్క బిహార్‌లోనే ప్రతిపక్ష ఆర్జేడీ అభ్యర్థి గెలుపొందారు. పోటీ చేసిన అన్ని చోట్లా భాజపా అభ్యర్థులు ఓటమి పాలయ్యారు.

  • పశ్చిమ బెంగాల్‌లో అసోన్‌సోల్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన అభ్యర్థి శత్రుఘ్న సిన్హా విజయం సాధించారు. భాజపా అభ్యర్థి అగ్నిమిత్ర పాల్‌పై 3,03,209 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక్కడ 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భాజపా నుంచి పోటీ చేసిన బాబుల్‌ సుప్రియో 1.97 లక్షల ఓట్లతో విజయం సాధించారు. ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేసి తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరడంతో ఉప ఎన్నిక జరిగింది.
  • పశ్చిమ బెంగాల్‌లోని బల్లిగంజ్‌ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో తృణమూల్‌ నుంచి పోటీ చేసిన బాబుల్‌ సుప్రియో విజయం సాధించారు. ఇక్కడ సీపీఎం అభ్యర్థి సైరా షా హలీమ్‌పై 20,228 ఓట్ల తేడాతో ఆయన గెలుపొందారు. భాజపాకు ఇక్కడ మూడో స్థానం దక్కింది. రాష్ట్ర మంత్రి సుభ్రతా ముఖర్జీ మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.
  • మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ నార్త్‌ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో మహా వికాస్‌ అఘాఢీ ప్రభుత్వంలో భాగస్వామి అయిన కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి జయశ్రీ జాదవ్‌ 18 వేల ఓట్ల తేడాతో భాజపా అభ్యర్థి సత్యజీత్‌ కదమ్‌పై గెలుపొందారు. ఇక్కడి సిట్టింగ్‌ ఎమ్మెల్యే చంద్రకాంత్‌ జాదవ్‌ కొవిడ్‌తో మరణించడంతో ఈ స్థానం ఖాళీ అయ్యింది.
  • బిహార్‌లోని బొచాహన్‌ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ప్రతిపక్ష ఆర్జేడీకి చెందిన అమర్‌ పాసవాన్‌ 35 వేల ఓట్లతో విజయం సాధించారు. పాసవాన్‌ తండ్రి ముజఫిర్‌ పాసవాన్‌ మరణంతో ఇక్కడ ఎన్నిక నిర్వహించారు. భాజపా నుంచి ఇక్కడ పోటీ చేసిన బేబీ కుమారి 45,353 ఓట్లు సాధించారు. బిహార్‌లో ప్రస్తుతం ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది.
  • ఛత్తీస్‌గఢ్‌లోని ఖైరాగఢ్‌ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్‌ పార్టీకి చెందిన యశోద నీలాంబర్‌ వర్మ విజయం సాధించారు. భాజపా అభ్యర్థి కోమల్‌ జంగేల్‌పై దాదాపు 20 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని