PM Modi: కేంద్రం నిధులు కొల్లగొట్టేందుకు.. నకిలీ జాబ్‌ కార్డులు..! మోదీ ధ్వజం

ఉపాధి హామీ పథకం కింద కేంద్ర నిధులను కాజేసేందుకు పశ్చిమ బెంగాల్‌లోని టీఎంసీ ప్రభుత్వం నకిలీ జాబ్‌కార్డులు సృష్టించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు.

Published : 09 Mar 2024 22:49 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC) ప్రభుత్వం లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) మరోసారి విరుచుకుపడ్డారు. రాష్ట్ర సంపదను దోచుకోవడమేగాకుండా ఉపాధి హామీ పథకం (MGNREGA) కింద కేంద్ర నిధులను కాజేసేందుకు నకిలీ జాబ్‌కార్డులు సృష్టించిందని ఆరోపించారు. సిలీగుడీలో నిర్వహించిన సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. అవినీతి టీఎంసీ ప్రభుత్వాన్ని గద్దె దించడం లోక్‌సభ ఎన్నికలతో మొదలవుతుందన్నారు. అభివృద్ధిని పక్కనపెట్టేసి.. దీదీ తన మేనల్లుడి గురించి, కాంగ్రెస్ పార్టీ తన రాజకుటుంబం గురించి మాత్రమే ఆలోచిస్తున్నాయని విమర్శించారు.

సోనియాగాంధీ, లాలూ లక్ష్యాలివే: అమిత్‌ షా

‘దేశంలోని తల్లులు కనీస సౌకర్యాల కోసం ఎంత కష్టపడుతున్నారో చూశాను. అందుకే వారి జీవితాలను సులభతరం చేసేందుకు పారిశుద్ధ్యం, ఉచిత విద్యుత్‌, బ్యాంక్‌ అకౌంట్లు, నీటి సదుపాయం వంటి వసతుల కల్పనకు కృషి చేస్తున్నాను. కానీ, బెంగాల్‌లో గతంలో వామపక్ష కూటమి, ప్రస్తుతం టీఎంసీ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజల కనీస అవసరాలను విస్మరించాయి’ అని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. సందేశ్‌ఖాలీ వ్యవహారాన్ని మరోసారి ప్రస్తావిస్తూ.. మహిళలపై అఘాయిత్యాలు, పేదల సంపాదనను దోచుకోవడం వంటివి టీఎంసీ గూండాల లక్షణమని ధ్వజమెత్తారు. ‘టీ- టింబర్‌- టూరిజం’ (తేయాకు, కలప, పర్యటకం) రంగాలను ప్రోత్సహిస్తూ ఉత్తర బెంగాల్ అభివృద్ధికి పాటుపడతామని హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని