
నాపై నిఘా పెట్టారా? భద్రత నాకొద్దు: ఎంపీ
దిల్లీ: తన నివాసం బయట బీఎస్‌ఎఫ్ జవాన్లను మోహరించడంపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ఆందోళన వ్యక్తంచేశారు. తక్షణమే వారిని ఉపసంహరించుకోవాలని కోరుతూ దిల్లీ పోలీసులకు లేఖ రాశారు. సాయుధ జవాన్ల కదలికలు చూస్తుంటే తనపై నిఘా ఉంచినట్టు అనిపిస్తోందంటూ దిల్లీ పోలీస్ కమిషనర్ ఎన్‌ఎన్ శ్రీవాస్తవకు రాసిన లేఖలో పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం 4.30గంటల సమయంలో తన అధికారిక నివాసానికి ఎస్‌హెచ్‌వో వచ్చారనీ.. ఆ తర్వాత రాత్రి 10గంటల సమయంలో ముగ్గురు సాయుధ బీఎస్‌ఎఫ్ అధికారులను ఇంటి బయట ఉంచినట్టు లేఖలో తెలిపారు. తనకు భద్రత కోసమే వచ్చినట్టు జవాన్లు చెబుతున్నారని పేర్కొన్నారు.
ఈ దేశ సాధారణ పౌరురాలిగా ఉండాలనుకుంటున్నానన్న మహువా.. తనకు భద్రత కావాలని ఎవరినీ అడగలేదన్నారు. తన ఇంటి వద్ద ఉన్న జవాన్లను తక్షణమే ఉపసంహరించుకోవాలని పోలీసులను కోరారు. పోలీసులకు రాసిన లేఖను ఆమె ట్వీట్ చేశారు. కేవలం తనను కాపాడేందుకే వనరులను వృథా చేయొద్దని సూచించారు. అందరికీ రక్షణ కల్పించాలి తప్ప తనకేమీ ప్రత్యేకంగా అవసరం లేదన్నారు. తనకు భద్రత అవసరం లేదని స్పష్టంచేశారు. తనపై నిఘా పెట్టాలంటే తనను అడగాలని, తానే చెబుతానని తెలిపారు. మహువా బెంగాల్‌లోని కృష్ణానగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.
ఇదీ చదవండి..
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.