యాసంగి ధాన్యం కేంద్రం కొనాల్సిందే.. తెలంగాణ వ్యాప్తంగా తెరాస ఆందోళనలు

తెలంగాణలో యాసంగిలో పండించే ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో రాష్ట్రంలోని ప్రధాన జాతీయ రహదారులపై తెరాస రాస్తారోకోలు నిర్వహించింది.

Updated : 06 Apr 2022 14:58 IST

హైదరాబాద్‌: తెలంగాణలో యాసంగిలో పండించే ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో రాష్ట్రంలోని ప్రధాన జాతీయ రహదారులపై తెరాస రాస్తారోకోలు నిర్వహించింది. ఈ సందర్భంగా పలుచోట్ల ఆ పార్టీ ప్రజాప్రతినిధులు రహదారులపై బైఠాయించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ వద్ద తెరాస నేతలు ఆందోళనకు దిగారు. హైదరాబాద్‌- బెంగళూరు జాతీయ రహదారులపై ధర్నా చేపట్టారు. భూత్పూర్‌ వద్ద రాస్తారోకోలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొన్నారు. మేడ్చల్‌- ముంబయి జాతీయ రహదారిపై తెరాస శ్రేణులు ధర్నాకు దిగాయి. ధర్నా వల్ల హైవేపై కాసేపు ట్రాఫిక్‌ భారీగా స్తంభించింది. దీంతో పోలీసులు తెరాస నాయకులను పీఎస్‌కు తరలించారు.

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు వద్ద జాతీయ రహదారిపై తెరాస ధర్నా చేపట్టింది. కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పాల్గొని నిరసన తెలిపారు. నకిరేకల్ జాతీయ రహదారిపైనా రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, రవీంద్రకుమార్‌లు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిర్మల్‌ జిల్లా సోన్‌ మండలం కడ్తాల్‌ వద్ద హైవేపై తెరాస నేతలు నిరసన తెలిపారు. రహదారులపై ధాన్యం, వరి పంటను ఉంచి నిరసన తెలిపారు. ధర్నాలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు విఠల్‌, రేఖానాయక్‌లు పాల్గొన్నారు. కొంపల్లి జాతీయ రహదారిపై కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు ఆధ్వర్యంలో రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.

ధాన్యం కొనుగోలుపై కేంద్ర వైఖరికి నిరసనగా ఇప్పటికే తెరాస అయిదంచెల పోరాట కార్యక్రమాలకు సిద్ధమైంది. మొదటి అంచెలో భాగంగా నాలుగో తేదీ మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని