వరద బాధితులకు పరిహారం పంపిణీ 

వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ భరోసా కల్పించారు. నాలుగో రోజు హైదరాబాద్‌ నగర శివారులోని అలీనగర్‌, గగన్‌పహాడ్‌లోని ..

Updated : 17 Oct 2020 13:58 IST

హైదరాబాద్‌: వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ భరోసా కల్పించారు. నాలుగో రోజు హైదరాబాద్‌ నగర శివారులోని అలీనగర్‌, గగన్‌పహాడ్‌లోని వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. వరదల్లో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున పరిహారం అందజేశారు. 

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ... వరదల వల్ల ప్రాణ నష్టం జరగడం బాధాకరమని, ప్రాణనష్టం అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నించిందని తెలిపారు.  వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో ప్రజలకు అవసరమైన రేషన్‌, వైద్య సహాయం అందించే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎంపీలు రంజిత్‌రెడ్డి, అసదుద్దీన్‌ ఒవైసీ, స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తదితరులు మంత్రి వెంట ఉన్నారు. పారిశుద్ధ్యంపై ప్రధానంగా దృష్టి సారించి పనిచేయాలని ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ అధికారులకు మంత్రి సూచించారు. అంటు వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం గగన్‌ పహాడ్‌ వద్ద అప్ప చెరువును మంత్రి పరిశీలించారు.  నీటిపారుదలశాఖతో సమన్వయం చేసుకుని వెంటనే చెరువు కట్టకు మరమ్మతులు చేయాలని సూచించారు. ఆక్రమణలు ఉంటే తొలగించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

వరదల వల్ల గగన్‌పహాడ్‌లో బుధవారం తెల్లవారుజామున ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గల్లంతయ్యారు. వారిలో కరీమా బేగం, అమెర్‌ ఖాన్‌, ఎండీ సాహిల్‌ మృతి చెందారు. ఎండీ ఆయాన్‌ ఆచూకీ ఇప్పటి లభించలేదు. అలీనగర్‌లో అదే రోజు 8మంది గల్లంతయ్యారు. వారిలో నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన వారి ఆచూకీ తెలియలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని