UP Polls: కాంగ్రెస్ కీలక ప్రకటన.. ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లికి టికెట్‌

2024 లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా పరిగణించే యూపీ అసెంబ్లీ ఎన్నికలు.. ఇప్పుడు యావత్‌ దేశాన్ని ఆకర్షిస్తున్నాయి. ఫిరాయింపులు, ఎత్తుకుపైఎత్తులతో రసవత్తరంగా మారుతున్నాయి.

Published : 13 Jan 2022 14:12 IST

లఖ్‌నవూ: దేశ రాజకీయాలకు కీలకమైన యూపీ అసెంబ్లీ ఎన్నికలు.. ఇప్పుడు యావత్‌ దేశాన్ని ఆకర్షిస్తున్నాయి. ఫిరాయింపులు, ఎత్తుకుపైఎత్తులతో రసవత్తరంగా మారుతున్నాయి. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ చేసిన ప్రకటన కూడా ఈ తరహాలోనిదే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ బాధితురాలి తల్లి ఆశా సింగ్‌ను కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రకటించింది. నేడు పార్టీ విడుదల చేసిన జాబితాలో ఆమె పేరును వెల్లడించింది. 

‘వేధింపులు, చిత్ర హింసలకు గురైన బాధితులకు కాంగ్రెస్ అండగా నిలుస్తుంది. తాజాగా విడుదల చేసిన జాబితా ద్వారా  కాంగ్రెస్ ఈ సందేశాన్ని పంపుతోంది’ అని ఈ సందర్భంగా ప్రియాంక వెల్లడించారు. ఈ ఎన్నికలకు సంబంధించి 125 మంది అభ్యర్థులతో కాంగ్రెస్‌ తొలి జాబితాను విడుదల చేసింది. అందులో 50 మంది మహిళా అభ్యర్థుల్లో ఆశాసింగ్ పేరు కూడా ఉంది. అలాగే గౌరవ వేతనం పెంపు కోసం చేపట్టిన ఆందోళనకు నాయకత్వం వహించిన ఆశావర్కర్ పూనమ్ పాండేను కూడా ఈ జాబితాలో చేర్చినట్లు తెలిపారు. పూనమ్.. షాజహాన్‌ పూర్ నుంచి బరిలో దిగుతున్నారు. ఈ జాబితాలో 40 శాతం మంది మహిళలు, 40 శాతం మంది యువతకు చోటుదక్కింది. ఈ చరిత్రాత్మక  ప్రయత్నం ద్వారా రాష్ట్రంలో కొత్త తరహా రాజకీయాలను తీసుకురావాలని భావిస్తున్నట్లు ప్రియాంక అన్నారు.

2017లో ఉన్నావ్‌కు చెందిన టీనేజ్ బాలికపై కుల్దీప్ సింగ్‌ సెంగార్ అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసిన సంగతి తెలిసిందే. సెంగార్‌పై చర్య తీసుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ బాధితురాలు సీఎం యోగి నివాసం ఎదుట ఆత్మహత్యకు ప్రయత్నించడంతో ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సమయంలో సెంగార్ భాజపా తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ ఘటన కాస్తా రాజకీయంగా తీవ్ర వివాదాస్పదం కావడంతో 2019లో పార్టీ సెంగార్‌ను బహిష్కరించింది. బాధితురాలు న్యాయం కోసం జరిపిన పోరాటంలో తన కుటుంబ సభ్యుల్ని కూడా కోల్పోయింది. అందుకు కారకుడైన సెంగార్‌ను కోర్టు దోషిగా తేల్చింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని