UP Elections: అయోధ్య నుంచి యోగి ఆదిత్యనాథ్‌ పోటీ?

ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అయోధ్య నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే వేద్‌ ప్రకాశ్‌ గుప్తా వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి....

Published : 26 Jul 2021 01:57 IST

బలం చేకూర్చిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే వ్యాఖ్యలు

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అయోధ్య నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే వేద్‌ ప్రకాశ్‌ గుప్తా వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ఆదివారం వేద్‌ ప్రకాశ్‌ మాట్లాడుతూ.. అయోధ్య నుంచి ముఖ్యమంత్రి పోటీ చేస్తానంటే అందుకు తాను సిద్ధమని పేర్కొన్నారు. ‘రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఇక్కడి నుంచి పోటీ చేస్తే అది అయోధ్య ప్రజలందరికీ గర్వకారణం. అదృష్టం. ఎవరు ఎక్కడి నుండి పోటీ చేయాలో పార్టీ నిర్ణయిస్తుంది. సీఎం ఆదిత్యనాథ్‌ అయోధ్య నుంచి పోటీ చేస్తానంటే మేమంతా ఆయన కోసం ప్రచారం నిర్వహిస్తాం.’ అని వేద్‌ ప్రకాశ్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో మరోసారి భాజపా ప్రభుత్వమే వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

యోగి ఆదిత్యనాథ్‌ అయోధ్య నుంచి పోటీ చేస్తారని వస్తున్న పుకార్లపై ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రతినిధి సురేంద్ర రాజ్‌పుత్‌ స్పందించారు. గత నాలుగేళ్ల కాలంలో ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్‌ అయోధ్య నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని వేద్‌ ప్రకాశ్‌ను డిమాండ్‌ చేశారు. ఎంతమందికి ఉపాధి కల్పించారు? ఎన్ని గ్రామాలకు మంచి నీటి సదుపాయం కల్పించారు? మహిళలపై జరుగుతున్న దాడులు, అకృత్యాలకు సంబంధించి ఎన్ని కేసులు నమోదయ్యాయో చెప్పాలని కోరారు.

ఈ పుకార్లపై సమాజ్‌వాదీ పార్టీ ప్రతినిధి జూహిసింగ్‌ సైతం మాట్లాడారు. ‘2017 నుంచి ప్రస్తుత ప్రభుత్వం తీరును ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి. నిరుద్యోగం పెరిగిపోతోంది. రైతుల పట్ల నియంతృత్వ వైఖరి.. వీటన్నింటికీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలపై ఆయన నోరు విప్పాలి’ అని అన్నారు. ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చని.. కానీ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని