రాజ్‌ ఠాక్రేకు ఆదిత్య ఠాక్రే సెటైర్‌.. నవనీత్‌ కౌర్‌ భర్తకు శివసేన వార్నింగ్‌!

మహారాష్ట్రలో హానుమాన్‌ చాలీసా చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. నిర్దేశించిన గడువులోగా లౌడ్‌ స్పీకర్లు తొలగించకుంటే మసీదుల వద్ద హనుమాన్‌ చాలీసా ప్లే చేస్తామంటూ రాజ్‌ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై తాజాగా మంత్రి ఆదిత్య ఠాక్రే స్పందించారు.

Published : 15 Apr 2022 19:30 IST

ముంబయి: మహారాష్ట్రలో హనుమాన్‌ చాలీసా చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. నిర్దేశించిన గడువులోగా లౌడ్‌ స్పీకర్లు తొలగించకుంటే మసీదుల వద్ద హనుమాన్‌ చాలీసా ప్లే చేస్తామంటూ రాజ్‌ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై తాజాగా మంత్రి ఆదిత్య ఠాక్రే స్పందించారు. ధరల పెరుగుదలకు కారణాలను లౌడ్‌స్పీకర్లలో తెలియజేయాలంటూ సెటైర్‌ వేశారు. ఈ వ్యవహారం ఇలానే కొనసాగుతుండగా.. ఉద్ధవ్‌ ఠాక్రేను ఉద్దేశించి నవనీత్‌ కౌర్‌ భర్త చేసిన వ్యాఖ్యలు శివసేన నేతల్లో ఆగ్రహం తెప్పించాయి.

మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్‌ ఠాక్రే ఇటీవల మహా వికాస్‌ అఘాఢీ ప్రభుత్వానికి ఓ డెడ్‌లైన్‌ విధించారు. మే 3వ తేదీలోపు మసీదుల వద్ద లౌడ్‌ స్పీకర్లు తొలగించకపోతే అక్కడ హానుమాన్‌ చాలీసాను ప్లే చేస్తామని హెచ్చరించారు. దీనిపై పరోక్షంగా స్పందించిన ఆదిత్య ఠాక్రే.. ‘‘నిత్యావసర ధరలు నిత్యం ఎందుకు పెరుగుతున్నాయో తెలియజేసేలా ప్రజల్లో అవగాహన కల్పించడానికి లౌడ్‌స్పీకర్లు వినియోగించాలి’’ అంటూ వ్యాఖ్యానించారు. ముఖ్యమైన సమస్యలపై దృష్టి సారించాలని పరోక్షంగా రాజ్‌ఠాక్రేకు హితవు పలికారు.

మరోవైపు ‘హనుమాన్‌ చాలీసా’ వ్యవహారంలో విదర్భ ప్రాంతానికి చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే, నటి నవనీత్‌ కౌర్‌ భర్త అయిన రానా జోక్యం చేసుకున్నారు. గతంలో భాజపా ప్రభుత్వానికి మద్దతిచ్చిన ఈయన.. తాజాగా ఓ వీడియో సందేశం విడుదల చేశారు. హనుమాన్‌ జన్మోత్సవం రోజున ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే హనుమాన్‌ చాలీసా పఠించాలని సూచించారు. లేదంటే మాతోశ్రీ (ఉద్ధవ్‌ నివాసం) వద్ద హనుమాన్‌ చాలీసా వినిపిస్తామని ఆ వీడియోలో పేర్కొన్నారు. దీనిపై శివసేన నేత కిశోరి పెడ్నేకర్‌ స్పందించారు. శివసైనికులు ఇంకా సజీవంగానే ఉన్నారని, దమ్ముంటే మాతోశ్రీకి వచ్చే సాహసం చేయాలని సవాల్‌ విసిరారు. మొత్తానికి రాజ్‌ఠాక్రే వద్ద మొదలైన ‘హనుమాన్‌ చాలీసా’ వ్యవహారం చుట్టూ మరాఠా రాజకీయాలు తిరుగుతున్నట్లైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని