ప్రధాని భద్రత గురించి ప్రియాంకకు వివరించడమేంటి? ఆమెకేం అధికారం ఉంది?: భాజపా

ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్‌ పర్యటనలో తలెత్తిన అవాంతరంపై భాజపా, కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ప్రధాని భద్రతపై ప్రియాంకకు వివరించానంటూ పంజాబ్‌ సీఎం చరణ్‌జీత్‌ చన్నీ చేసిన వ్యాఖ్యలపై తాజాగా భాజపా అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర విమర్శలు గుప్పించారు.

Updated : 10 Jan 2022 04:43 IST

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్‌ పర్యటనలో తలెత్తిన అవాంతరంపై భాజపా, కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ప్రధాని భద్రతపై ప్రియాంకకు వివరించానంటూ పంజాబ్‌ సీఎం చరణ్‌జీత్‌ చన్నీ చేసిన వ్యాఖ్యలపై తాజాగా భాజపా అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర విమర్శలు గుప్పించారు. ఆమెకు ఏం అధికారం ఉందని ప్రధాని భద్రత గురించి వివరించారని ప్రశ్నించారు.

‘‘ప్రధాని భద్రత గురించి ఒక సిట్టింగ్‌ సీఎం ప్రియాంక గాంధీకి వివరించడమేంటి? ఆమె ఏ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారని? ప్రధాని భద్రత గురించి ఆరా తీయడానికి ఇంతకీ ఆమె ఎవరు’’ అని సంబిత్‌ ప్రశ్నించారు. ‘‘చన్నీ సాబ్‌! మీరు నిజాలు మాట్లాడాలి.. ఆమెతో ‘మీరు చెప్పినట్లుగానే పని పూర్తయ్యిందని చెప్పి ఉండాల్సింది’’ అని సంబిత్‌ అన్నారు.

పంజాబ్‌ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ కాన్వాయ్‌ నిలిచిపోవడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌ చన్నీ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని పర్యటనలో ఎలాంటి భద్రతా లోపాలూ లేవని వివరించారు. కిలోమీటర్‌ పరిధిలో ఆయన దరిదాపుల్లోకి కూడా ఎవరూ రాలేదని వివరించారు. ఇదే విషయాన్ని ప్రియాంక గాంధీకి కూడా వివరించానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సంబిత్‌ పాత్ర విమర్శలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని