మీరు వద్దంటే నామినేషన్‌ వేయను: దీదీ 

పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌ నుంచి పోటీ చేస్తున్న మమతా బెనర్జీ రేపు (మార్చి 10న) నామినేషన్‌ వేయనున్న నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు .......

Published : 09 Mar 2021 18:20 IST

నందిగ్రామ్‌: పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌ నుంచి పోటీ చేస్తున్న మమతా బెనర్జీ రేపు (మార్చి 10న) నామినేషన్‌ వేయనున్న నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. నందిగ్రామ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ.. ప్రజలు తనను వద్దనుకుంటే తాను నామినేషన్‌ వేయనన్నారు. కానీ, ప్రజలు తమ కుమార్తెగా తనను భావిస్తే నామినేషన్‌ వేసే దిశగా ముందుకు సాగుతానన్నారు. తన సొంత నియోజకవర్గమైన భవానీపూర్‌లో కాకుండా ఈసారి నందిగ్రామ్‌ నుంచి పోటీ చేస్తున్న మమతను కొందరు భాజపా నేతలు బయటి వ్యక్తిగా పేర్కొనడంపై దీటుగా స్పందించారు. బెంగాలీనైన తాను బయటి వ్యక్తినైతే.. దిల్లీ నుంచి వచ్చిన మీరేంటని దీదీ ప్రశ్నించారు.

మరోవైపు, బెంగాల్‌లో భాజపాను ఢీకొట్టి హ్యాట్రిక్‌ విజయం సాధించాలన్న కసితో దూసుకెళ్తున్నారు తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ. ఇప్పటికే తమ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన దీదీ.. ఎన్నికల మేనిఫెస్టోకు తుదిరూపు ఇచ్చారు. ఈ నెల 11న మహా శివరాత్రి రోజున పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్టు సమాచారం. అదే రోజు ఉదయం నందిగ్రామ్‌లో శివరాత్రి పూజల్లో పాల్గొన్న అనంతరం సాయంత్రం కోల్‌కతాకు చేరుకొని కాళీఘాట్‌ రెసిడెన్సీలో మేనిఫెస్టో విడుదల చేస్తారని తెలుస్తోంది. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేలా వ్యూహాత్మకంగా అభ్యర్థుల జాబితాను ప్రకటించిన దీదీ.. మేనిఫెస్టోలో ఎలాంటి హామీలు పొందుపరుస్తారోనన్న ఆసక్తి రాష్ట్ర ప్రజల్లో నెలకొంది. 291మంది అభ్యర్థులతో ఒకేసారి ప్రకటించిన జాబితాలో  114 మంది కొత్త అభ్యర్థులే కావడం గమనార్హం. రాష్ట్రంలో రాజకీయంగా కీలకంగా ఉన్న 49శాతం మహిళా ఓటర్లు, 30శాతంగా ఉన్న మైనార్టీ ఓటర్లను ఆకర్షించేలా 50 మంది మహిళలు, 42మంది మైనార్టీలకు సీట్లు ఇచ్చారు. అంతేకాకుండా టీఎంసీ జాబితాలో 79మంది ఎస్సీలు, 17మంది ఎస్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులకు చోటు కల్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని