ఉత్తర కొరియాకు అండగా రష్యా, చైనాల వీటో

ఆంక్షల తీర్మానానికి భద్రతా మండలిలో అడ్డుకట్ట  ఐరాస: అణ్వస్త్రాలను మోసుకెళ్లగల ఖండాంతర క్షిపణి (ఐసీబీఎం) ప్రయోగాలను నిర్వహించినందుకు ఉత్తర కొరియాపై కఠిన ఆర్థిక ఆంక్షలు విధించాలన్న ప్రతిపాదనను గురువారం

Published : 28 May 2022 06:38 IST

ఆంక్షల తీర్మానానికి భద్రతా మండలిలో అడ్డుకట్ట  ఐరాస: అణ్వస్త్రాలను మోసుకెళ్లగల ఖండాంతర క్షిపణి (ఐసీబీఎం) ప్రయోగాలను నిర్వహించినందుకు ఉత్తర కొరియాపై కఠిన ఆర్థిక ఆంక్షలు విధించాలన్న ప్రతిపాదనను గురువారం ఐరాస భదతా మండలిలో చైనా, రష్యాలు వీటో చేశాయి. 15 సభ్య దేశాలు గల ఈ మండలిలో 5 దేశాలకు వీటో అధికారం ఉంది. ఈ ఏడాది ఇంతవరకు ఉత్తర కొరియా నిర్వహించిన ఆరు ఐసీబీఎం పరీక్షలు అంతర్జాతీయ సమాజానికి ప్రమాదకరమని, ఈ విషయంలో భద్రతా మండలి సమైక్యంగా చర్యలు తీసుకోవాలని సమితిలో అమెరికా రాయబారి లిండా గ్రీన్‌ ఫీల్డ్‌ గురువారం ఓటింగ్‌కు ముందు పిలుపు ఇచ్చారు. ఐసీబీఎం పరీక్షలు కొనసాగిస్తే ఉత్తర కొరియాకు పెట్రోలియం ఎగుమతులను నిలిపేయాలన్న 2017 డిసెంబరు నాటి భద్రతా మండలి తీర్మానాన్ని ఆమె గుర్తుచేశారు.

2006లో ఉత్తర కొరియా తొలిసారి అణ్వస్త్ర పరీక్ష నిర్వహించినప్పుడు భద్రతా మండలి ఉమ్మడిగా ఆర్థిక ఆంక్షలు విధించింది. ఆ తర్వాత ఆ దేశం అణు, క్షిపణి పరీక్షలు జరిపినప్పుడల్లా ఆంక్షలను కఠినతరం చేస్తూ, ఆర్థిక సహాయం నిలిపేస్తూ వచ్చింది. మధ్యలో అయిదేళ్లపాటు ఐసీబీఎం క్షిపణి పరీక్షలను విరమించిన ఉత్తర కొరియా గడచిన అయిదు నెలల్లోనే ఆరు పరీక్షలు నిర్వహించింది. వాటిలో చివరిది బుధవారం జరిగింది. తోడుగా రెండు స్వల్పశ్రేణి  క్షిపణి పరీక్షలూ జరిపిందని దక్షిణ కొరియా తెలిపింది. దీనితో ఈ ఏడాది ఉత్తర కొరియా ఐసీబీఎం, ఇతర క్షిపణులను కలుపుకొని మొత్తం 17 పరీక్షలు నిర్వహించింది. దీన్ని ఖండిస్తూ గురువారం భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానం ఉత్తర కొరియాకు ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులను, ఆ దేశం నుంచి ఖనిజ నూనెలు, ఇంధనాల ఎగుమతులను మరింత తగ్గించాలని నిర్దేశించింది. ఉత్తర కొరియా ప్రభుత్వం సృష్టించిన సైబర్‌ గూఢచర్య సంస్థ లాజరస్‌ గ్రూపునకు ప్రపంచమంతటా ఉన్న ఆస్తులను స్తంభింపజేయాలనే ఆ దేశం నుంచి కూలీలను ఇతర దేశాలకు పంపి ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే నాంగాంగ్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ ఆస్తులనూ స్తంభింపజేయాలని ప్రతిపాదించింది.

ఉత్తర కొరియాపై కొత్త ఆంక్షల విధింపును తాము వ్యతిరేకిస్తున్నామని సమితిలో చైనా రాయబారి ఝాంగ్‌ జున్‌ స్పష్టం చేశారు. చర్చల ద్వారా రాజకీయ పరిష్కారం కనుగొనాలని అమెరికాకు సూచించారు. కొరియా ద్వీపకల్పంలో ప్రస్తుత పరిస్థితులను అడ్డుపెట్టుకుని ఆసియాలో తన వ్యూహాత్మక, రాజకీయ లక్ష్యాలను సాధించుకోవడానికి ఏ దేశమూ ప్రయత్నించకూడదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని