చైనా ప్రమాదకారి

రానున్న దశాబ్దంలో రష్యా వల్లే తమకు ప్రధాన ముప్పు ఎదురవుతుందని ఉత్తర అట్లాంటిక్‌ సైనిక కూటమి (నాటో) తమ వ్యూహపత్రంలో బుధవారం పేర్కొంది. మొట్టమొదటిసారిగా చైనాను కూడా ప్రమాదకారిగా వర్ణించింది. భూమి మీద, అంతరిక్షంలో,

Published : 01 Jul 2022 06:34 IST

 తొలిసారి వ్యూహపత్రంలో పేర్కొన్న నాటో

బ్రస్సెల్స్‌: రానున్న దశాబ్దంలో రష్యా వల్లే తమకు ప్రధాన ముప్పు ఎదురవుతుందని ఉత్తర అట్లాంటిక్‌ సైనిక కూటమి (నాటో) తమ వ్యూహపత్రంలో బుధవారం పేర్కొంది. మొట్టమొదటిసారిగా చైనాను కూడా ప్రమాదకారిగా వర్ణించింది. భూమి మీద, అంతరిక్షంలో, సైబర్‌ సీమలో, సముద్రాలలో సర్వామోదనీయ అంతర్జాతీయ నియమ నిబంధనలను ఉల్లంఘించడానికి చైనా ప్రయత్నిస్తూనే ఉందనీ, రష్యాతో ఆ దేశానికున్న సన్నిహిత సంబంధాలు ఉపేక్షించలేనివని పేర్కొంది. స్పెయిన్‌ రాజధాని మాద్రీద్‌లో మూడు రోజుల సమావేశంలో ఉత్తర ఆఫ్రికా, పశ్చిమాసియాలలోని అస్థిర పరిస్థితుల గురించి కూడా నాటో నాయకులు చర్చించారు. రష్యా దండయాత్రను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌కు తోడ్పాటు అందిస్తూనే ఉంటామని ప్రకటించారు. రష్యాను నిలువరించడానికి తూర్పు ఐరోపా దేశాలలో ఇప్పుడున్న నాటో సైనికుల సంఖ్యను 40 వేల నుంచి మూడు లక్షలకు పెంచాలని నిశ్చయించారు. టర్కీ అపోహలను తొలగించి- స్వీడన్‌, ఫిన్లాండ్‌లు నాటోలో చేరడానికి పచ్చజెండా ఊపారు.

ఉక్రెయిన్‌కు అమెరికా, బ్రిటన్‌ మిలిటరీ సాయం

ఉక్రెయిన్‌కు తమ దేశం తరఫున త్వరలో మరో 80 కోట్ల డాలర్ల మిలిటరీ సాయం అందించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. ఈ సహాయంలో భాగంగా ఆ దేశానికి గగనతల రక్షణ వ్యవస్థలు, కౌంటర్‌ బ్యాటరీ రాడార్లు, హై మొబిలిటీ ఆర్టిల్లరీ రాకెట్‌ సిస్టిమ్‌ల కోసం అదనపు పేలుడు పదార్థాల వంటివి పంపించనున్నట్లు తెలిపారు. నాటో తాజా వ్యూహపత్రంలో రష్యాను ప్రధాన ముప్పుగా పేర్కొనడం, మొట్టమొదటిసారి చైనాను ప్రస్తావించడం పెద్ద మలుపని బైడెన్‌ వ్యాఖ్యానించారు. నాటో దేశాలు తమ రక్షణ వ్యయాన్ని జీడీపీలో 2 శాతానికి పెంచుతామని ప్రకటించాయి. ఉక్రెయిన్‌కు తాము అదనంగా 121 కోట్ల డాలర్ల ఆయుధ సహాయం పంపనున్నట్లు బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ ప్రకటించారు.  
ః తమపై నాటో విమర్శలను రష్యా, చైనా తిప్పికొట్టాయి. నాటో కూటమే ప్రపంచవ్యాప్తంగా సమస్యలు సృష్టిస్తోందంటూ చైనా ఎదురుదాడి చేసింది. అస్థిరతకు ఆ కూటమి మూలమని విమర్శించింది. ఫిన్లాండ్‌, స్వీడన్‌లను నాటోలో చేర్చుకుంటే దీటుగా జవాబిస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని