హైకోర్టు మాజీ జడ్జిపై సీబీఐ విచారణ

అలహాబాద్‌ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎన్‌.శుక్లాపై వచ్చిన అవినీతి ఆరోపణల మీద విచారణ జరిపేందుకు

Published : 27 Nov 2021 12:46 IST

అనుమతిచ్చిన కేంద్రం

దిల్లీ: అలహాబాద్‌ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎన్‌.శుక్లాపై వచ్చిన అవినీతి ఆరోపణల మీద విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అనుమతి ఇచ్చింది. లఖ్‌నవూ బెంచ్‌లో న్యాయమూర్తిగా పనిచేసినప్పుడు ఓ ప్రయివేటు వైద్య కళాశాలకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చినట్టు ఆరోపణలు వచ్చాయి. ఆయనతో పాటు ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఐ.ఎం.ఖుద్దూసి, ప్రసాద్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్టుకు చెందిన భగవాన్‌ ప్రసాద్‌ యాదవ్, పలాష్‌ యాదవ్, మరో ఇద్దరు ప్రయివేటు వ్యక్తులు భావనా పాండే, సుధీర్‌ గిరిలపైనా కేసులు నమోదయ్యాయి. ఆ వైద్య కళాశాలకు అనుకూలంగా ఆదేశాలు ఇచ్చే వ్యవహారంలో సొమ్ము చేతులు మారినట్టు సీబీఐ ఆరోపించింది. కేసు నమోదు చేసే సమయానికి జస్టిస్‌ శుక్లా పదవిలో ఉండడంతో ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వాలని సీబీఐ ఏప్రిల్‌ 16న కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది.

జస్టిస్‌ ఖుద్దుసీ అప్పటికే పదవీ విరమణ చేయడంతో అనుమతి తీసుకోవాల్సిన అవసరం రాలేదు. తగిన సౌకర్యాలు లేకపోవడంతో ప్రసాద్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ సంస్థ విద్యార్థులను చేర్చుకోరాదంటూ 2017 మే నెలలో కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై ఆ సంస్థ తొలుత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తరువాత ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకొంది. కొంత విరామం తరువాత ఆగస్టు 24న అలహాబాద్‌ హైకోర్టు లఖ్‌నవూ బెంచ్‌లో ఇంకో వ్యాజ్యం వేసింది. మరుసటి రోజున వ్యాజ్యం విన్న జస్టిస్‌ శుక్లా ఆ సంస్థకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చారు. ఈ వ్యవహారంలో సొమ్ము చేతులు మారిందని, ఇందులో నిందితులకు సంబంధం ఉందని సీబీఐ ఆరోపించింది. ఈ ఆరోపణలపై అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్ర మూడు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులతో అంతర్గత కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపించింది. ఆరోపణలు నిజమే అని తేలడంతో స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయాలని జస్టిస్‌ శుక్లాను ఆదేశించారు. అందుకు అంగీకరించకపోవడంతో ఆయనకు ఉన్న న్యాయపరమైన అధికారాలను తొలగించారు. తరువాత వచ్చిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గొగొయ్‌ కూడా ఆయనను పదవి నుంచి తొలగించాలని ప్రధానికి సిఫార్సు చేశారు. 2020 జులైలో జస్టిస్‌ శుక్లా పదవీ విరమణ చేయడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. తాజాగా ఆయనపై దర్యాప్తుకు అంగీకారం తెలిపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని