Ukraine Crisis: నల్లసముద్రంలో నౌకలకు అడ్డంకులు కల్పించొద్దు

ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో... అక్కడి నల్లసముద్రం, అజోవ్‌ సాగర తీరాల్లో చిక్కుకున్న

Updated : 13 Mar 2022 10:32 IST

 అంతర్జాతీయ నౌకాయాన సంస్థ 

జెనీవా, మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో... అక్కడి నల్లసముద్రం, అజోవ్‌ సాగర తీరాల్లో చిక్కుకున్న వాణిజ్య నౌకలు తరలిపోయేందుకు సేఫ్‌ కారిడార్‌ను ఏర్పాటు చేయాలని అంతర్జాతీయ నౌకాయాన సంస్థ (ఐఎంవో) పిలుపునిచ్చింది. ఐరాసకు చెందిన ఈ విభాగం... అంతర్జాతీయ సముద్రయానం, సముద్ర చట్టాలను పర్యవేక్షిస్తుంది. నల్లసముద్ర తీరంలో పేలుళ్లు రెండు రవాణా నౌకలను తాకడంతో శనివారం సమావేశమైంది. వాణిజ్య నౌకలపై రష్యా దాడులను ఖండించింది. నావికుల భద్రత, సంక్షేమంతో పాటు సముద్ర పర్యావరణానికీ ఇవి హాని చేస్తాయని హెచ్చరించింది. ఉక్రెయిన్‌ యుద్ధం ఆరంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ 579 మంది పౌరులు మృతిచెందగా, మరో 982 మంది తీవ్రంగా గాయపడినట్టు... ఐరాస మానవ హక్కుల హైకమిషనర్‌ కార్యాలయం వెల్లడించింది. మృతుల్లో 42 మంది చిన్నారులు ఉన్నట్టు వివరించింది.

రూ.4,437 కోట్ల విలువైన నౌక స్వాధీనం

ఉక్రెయిన్‌పై యుద్ధం ఆపేలా రష్యాపై ఆర్థికంగా ఒత్తిడి తెచ్చేందుకు ఇటలీ పలు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ట్రియెస్టే నౌకాశ్రయంలో ఉన్న రష్యా సూపర్‌యాచ్‌ను ఇటలీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విలాసవంతమైన ఈ నౌక విలువ సుమారు రూ.4,437 కోట్లు (578 మిలియన్‌ డాలర్లు)! బొగ్గు, ఎరువుల ఉత్పత్తిలో పేరుగాంచిన రష్యా వాణిజ్యవేత్త ఆండ్రీ ఇగోరెవిచ్‌ మెల్నిచెంకోకు చెందిన సూపర్‌యాచ్‌ ‘సే ఏ’గా దీన్ని పోలీసులు గుర్తించారు. గతవారం కూడా పలువురు రష్యా కుబేరులకు చెందిన విలాసవంత పడవలను, విల్లాలను ఇటలీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని