North Korea : ఉ.కొరియా దూకుడు అణ్వస్త్ర పాటవ ఖండాంతర క్షిపణి ప్రయోగం

అమెరికాను తాకగల ఖండాంతర క్షిపణి (ఐసీబీఎం)ని గురువారం ప్రయోగించిన ఉత్తర కొరియా.. ఇక దీర్ఘకాలం సై అంటే సై అనగల సత్తా తమ

Published : 26 Mar 2022 11:06 IST

 

సియోల్‌: అమెరికాను తాకగల ఖండాంతర క్షిపణి (ఐసీబీఎం)ని గురువారం ప్రయోగించిన ఉత్తర కొరియా.. ఇక దీర్ఘకాలం సై అంటే సై అనగల సత్తా తమ సొంతమని సంబరపడుతోంది. శత్రువు తమపై దాడి చేయకుండా నిరోధించడానికి తగు అణ్వస్త్ర పాటవాన్ని సమకూర్చుకున్నామని శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఉత్తర కొరియా ప్రయోగించిన హ్వాసోంగ్‌-17 ఖండాతర క్షిపణి 6,248 కిలోమీటర్ల ఎత్తును అందుకొని, 67 నిమిషాల్లో 1,090 కిలోమీటర్ల దూరం పయనించి జపాన్‌కు సమీపంలోని సముద్ర జలాల్లో పడింది. టన్నుకన్నా తక్కువ బరువుండే బాంబులను అమర్చితే హ్వాసోంగ్‌ 15,000 కిలోమీటర్ల దూరం పయనించగలదని జపాన్, దక్షిణ కొరియా సైన్యాలు వివరించాయి. అంటే.. ఈ క్షిపణికి అమెరికా గడ్డను తాకే శక్తి ఉందన్న మాట. రోడ్డు మార్గంలో సంచరించగల క్షిపణి వ్యవస్థలన్నింటిలోకీ ఇదే పెద్దది. ఏడాదిలో  ఇప్పటివరకు మొత్తం 12 క్షిపణి ప్రయోగాలు నిర్వహించిన ఉత్తర కొరియా.. అమెరికా తనను అణ్వస్త్ర రాజ్యంగా గుర్తించాలనీ, ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలని చాలాకాలంగా కోరుతోంది. ఈ దిశగా ఒత్తిడి పెంచడానికే తాజా క్షిపణి ప్రయోగానికి ఒడిగట్టింది. గత నవంబరు 17న జరిపిన ఐసీబీఎం ప్రయోగం తరవాత మళ్లీ అలాంటి క్షిపణిని పరీక్షించడం ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా త్వరలోనే అణ్వస్త్ర పరీక్షలను పునరుద్ధరించే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా. అణ్వస్త్ర పరీక్షల స్థలంలోని సొరంగాలను 2018లో ఈ దేశం కూల్చివేసింది. తరవాత కొద్దివారాలకే అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ చర్చలు జరిపారు. అణ్వస్త్ర సామర్థ్యంపై కొంతవరకు పరిమితులు విధించుకుంటామనీ, దానికి బదులుగా తమపై ఆర్థిక ఆంక్షలు ఎత్తివేయాలని కోరారు. అమెరికా ఇందుకు నిరాకరించింది. ఫలితంగా నాటి చర్చలు విఫలమయ్యాయి. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ సైతం చర్చల పునరుద్ధరణకు అంగీకరించినా, ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయడానికి నిరాకరించారు. దీంతో బైడెన్‌ సర్కారుపై ఒత్తిడి తీసుకురావడానికి కిమ్‌ మళ్లీ అణ్వస్త్ర పరీక్షలకు తెగబడవచ్చని నిపుణులు భావిస్తున్నారు. తాజాగా ప్రయోగించిన హ్వాసోంగ్‌-17 ఖండాంతర క్షిపణికి అణుబాంబులను తీసుకువెళ్లే సామర్థ్యం ఉంది. 

* మరోవైపు.. హ్వాసోంగ్‌ ప్రయోగానికి ప్రతిగా దక్షిణ కొరియా విమానం నుంచి, నౌక నుంచి, భూమిపై నుంచి క్షిపణులను ప్రయోగించింది. ఉత్తర కొరియాలోని క్షిపణి ప్రయోగ కేంద్రాలను సూటిగా కొట్టి ధ్వంసం చేయగల సత్తా తనకుందని చాటుకోడానికే ఈ ప్రయోగాలు జరిపింది. ఉత్తర కొరియా ఐసీబీఎం పరీక్షలపై తనకు తానుగా విధించుకున్న నిషేధాన్ని ఇప్పుడు తానే ఉల్లంఘించడాన్ని దక్షిణ కొరియా తప్పుపట్టింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని