Nitish kumar: ఎన్డీయేలో లుకలుకలు.. నీతీశ్‌ గద్దె దిగుతారా?

బిహార్‌ సీఎం పదవి నుంచి జేడీయూ అధినేత నీతీశ్‌ కుమార్‌ వైదొలగనున్నారా? ఎన్డీయే కూటమిలో లుకలుకలే అందుకు కారణమా?

Updated : 31 Mar 2022 10:21 IST

బిహార్‌లో ఆసక్తి రేపుతున్న రాజకీయాలు 

ఈనాడు, దిల్లీ: బిహార్‌ సీఎం పదవి నుంచి జేడీయూ అధినేత నీతీశ్‌ కుమార్‌ వైదొలగనున్నారా? ఎన్డీయే కూటమిలో లుకలుకలే అందుకు కారణమా? ఈ ప్రశ్నలన్నింటికీ ఇప్పుడు ‘అవును’ అని సమాధానం వినిపిస్తోంది! ఏదో ఒకరోజు తాను రాజ్యసభకు వెళ్లాలనుకుంటున్నట్లు స్వయంగా నీతీశ్‌ బుధవారం చెప్పడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది. 2020 నాటి బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా, జేడీయూ పొత్తు పెట్టుకొని బరిలో దిగాయి. కమలనాథులు 74 సీట్లు గెల్చుకోగా, జేడీయూ 43 స్థానాలు దక్కించుకుంది. రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీకి కట్టుబడి నీతీశ్‌ను కమలదళం సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. తర్వాత ఉప ఎన్నికలతో జేడీయూ సీట్ల సంఖ్య 45కు పెరిగింది. ఈ నెల 23న వికాస్‌ శీల్‌ ఇన్సాఫ్‌ (వీఐపీ) ఎమ్మెల్యేలు ముగ్గురు భాజపాలో చేరారు. దీంతో ఆర్జేడీ (75)ని అధిగమించి రాష్ట్రంలో ఏకైక అతిపెద్ద పార్టీగా కమలదళం అవతరించింది. భాజపా-జేడీయూ బంధం చాలాకాలంపాటు బాగానే సాగినా.. కొన్నాళ్లుగా కూటమిలో లుకలుకలు బయటపడుతున్నాయి.

ముఖ్యమంత్రి పదవిని భాజపా, జేడీయూ చెరి రెండున్నరేళ్లపాటు పంచుకోవాలని కమలదళం ఎంపీ ఛేదీ పాస్వాన్‌ గత నెల్లో డిమాండ్‌ చేశారు. తమకూ సీఎం పదవిని ఇవ్వాల్సిందేనని భాజపా ఎమ్మెల్యే వినయ్‌ బిహారీ కూడా తాజాగా గళమెత్తారు. ముగ్గురు వీఐపీ శాసనసభ్యుల చేరికతో కమలనాథులు ఈ విషయంపై మరింత స్వరం పెంచుతున్నారు. ఈ పరిస్థితుల్లో- ఎంపిక చేసిన కొంతమంది పాత్రికేయులతో బుధవారం పట్నాలో జరిగిన సమావేశంలో నీతీశ్‌ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తి పెంచాయి. ‘‘రాజ్యసభకు వెళ్లేందుకు నేను వెనకాడబోను. ప్రస్తుతానికైతే సీఎంగా నాకు కొన్ని బాధ్యతలున్నాయి. కానీ ఏం జరుగుతుందో చెప్పలేను’’ అని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రంలో భాజపా ఏవైనా కీలక బాధ్యతలు అప్పగిస్తే ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగేందుకు తాను సిద్ధమేనని సంకేతాలిచ్చేందుకే నీతీశ్‌ ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని