India-Britain: బ్రిటన్‌ ప్రధాని పర్యటనలో... భారీగా వాణిజ్య ఒప్పందాలు!

బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌.. భారత పర్యటనలో భాగంగా ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులకు సంబంధించి భారీ ప్రకటనలు చేయనున్నట్టు యూకే హైకమిషన్‌ 

Published : 22 Apr 2022 09:18 IST

దిల్లీ, అహ్మదాబాద్‌: బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌.. భారత పర్యటనలో భాగంగా ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులకు సంబంధించి భారీ ప్రకటనలు చేయనున్నట్టు యూకే హైకమిషన్‌ గురువారం వెల్లడించింది. బ్రిటన్‌ వ్యాప్తంగా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ మొదలు ఆరోగ్య రంగం వరకూ.. సుమారు 11 వేల ఉద్యోగాలను సృష్టించే రూ.9,948 కోట్ల (ఒక బిలియన్‌ పౌండ్ల) విలువైన వాణిజ్య ఒప్పందాలు భారత్‌తో కుదుర్చుకోనున్నట్టు తెలిపింది. 5జీ టెలికాం, కృత్రిమ మేధ మొదలు ఆరోగ్య పరిశోధన, పునరుత్పాదక ఇంధన వనరులు వంటి అనేక అంశాల్లో భారత్‌-బ్రిటన్‌లు ప్రపంచాన్ని నడిపిస్తున్నాయని బోరిస్‌ జాన్సన్‌ అభిప్రాయపడినట్టు హైకమిషన్‌ తెలిపింది. ఉభయ దేశాల భాగస్వామ్యం ప్రజలకు అవకాశాలను, ఉద్యోగాలను, అభివృద్ధిని అందిస్తున్నాయని... భవిష్యత్తులో ఈ బంధం మరింత బలోపేతం కానుందని పేర్కొంది. మోదీతో భేటీ సందర్భంగా ద్వైపాక్షిక రక్షణ, భద్రత, వాణిజ్యం, వాతావరణ మార్పులు, ఉక్రెయిన్‌ సంక్షోభం తదితర కీలక అంశాలపై జాన్సన్‌ చర్చిస్తారని వెల్లడించింది. భారత్‌-బ్రిటన్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపైనా నేతల మధ్య కీలక చర్చలు జరగనున్నాయని... భారత్‌లో బ్రిటన్‌ వాణిజ్యం, పెట్టుబడులు 2030 నాటికి రెట్టింపు అయ్యేందుకు జాన్సన్‌ పర్యటన దోహదపడనుందని హైకమిషన్‌ ఆశాభావం వ్యక్తం చేసింది.

వారిని న్యాయస్థానం ముందుకు తీసుకురావాల్సి ఉంది...

బోరిస్‌ జాన్సన్‌ పర్యటన నేపథ్యంలో విదేశీ వ్యవహారాలశాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చిని విలేకరులు పలు ప్రశ్నలు అడిగారు. నీరవ్‌ మోదీ తదితర ఆర్థిక నేరగాళ్లను స్వదేశానికి తీసుకొచ్చే అంశం నేతల మధ్య చర్చకు వస్తుందా? అని ప్రశ్నించారు. ఇందుకు బాగ్చి బదులిస్తూ- ‘‘ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన వారిని న్యాయస్థానం ముందు హాజరు పరచాల్సిన విషయాన్ని అనేక వేదికలపై పదేపదే ప్రస్తావిస్తూ వస్తున్నాం. భారత వ్యతిరేక కార్యకలాపాలు చేపడుతున్న వ్యక్తుల నుంచి భద్రతా పరమైన సవాళ్లు ఎదురవుతాయన్న విషయంపైనా ఆందోళన వ్యక్తం చేశాం. అయితే, భారత్‌-బ్రిటన్‌ ప్రధానులు ఏయే విషయాలపై ప్రధానంగా మాట్లాడతారన్నది చెప్పలేం’’ అని బాగ్చి చెప్పారు. మోదీ, జాన్సన్‌ల మధ్య ఇండో-పసిఫిక్‌ ప్రాంతంపై ప్రధానంగా చర్చ జరగవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.

అభివాదం... వివాదాస్పదం

భారత్‌ పర్యటనలో భాగంగా గుజరాత్‌లో జేసీబీ కర్మాగారాన్ని ప్రారంభించిన జాన్సన్‌ అనంతరం ఓ బుల్డోజర్‌పైకి ఎక్కారు. చేతులు ఊపుతూ మీడియా ప్రతినిధులకు అభివాదం చేశారు. వివిధ రాష్ట్రాల్లో తలెత్తిన మతపరమైన విద్వేషాల క్రమంలో- భాజపా పాలిత దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పలు ఇళ్లు, దుకాణాలను బుల్డోజర్లతో ధ్వంసం చేయడం తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. భాజపా పాలిత ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్‌ రాష్ట్రాల్లోనూ బుల్డోజర్లను ఉపయోగించి పలు నిర్మాణాలను కూల్చివేశారు. ఈ క్రమంలో జాన్సన్‌ బుల్డోజరుపైకి ఎక్కి చేతులు ఊపడం తీవ్ర చర్చకూ, విమర్శలకూ తావిచ్చింది. సామాజిక మాధ్యమాలనూ కుదిపేసింది. దీన్ని ఆమ్నెస్టీ ఇండియా ‘అజ్ఞాన చర్య’గా పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని