Updated : 05 Oct 2020 18:52 IST

క్రికెట్‌ అభిమానులకు భారీ షాక్‌!

లీగ్‌ నుంచి ఇద్దరు భారత సీనియర్‌ క్రికెటర్లు దూరం

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రికెట్‌ అభిమానులకు భారీ షాక్! యూఏఈ వేదికగా జరుగుతున్న లీగ్‌ నుంచి భారత సీనియర్‌ క్రికెటర్లు భువనేశ్వర్‌ కుమార్‌, అమిత్‌ మిశ్రా గాయాలతో దూరం కానున్నారు. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో భువనేశ్వర్‌ తుంటికి గాయమైన సంగతి తెలిసిందే. 19వ ఓవర్‌లో బౌలింగ్‌ చేస్తూ అతడు గాయపడ్డాడు. దీంతో మ్యాచ్‌ మధ్యలోనే మైదానాన్ని వీడాడు. అనంతరం ముంబయితో జరిగిన మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు. అయితే అతడి గాయం తీవ్రత అధికంగా ఉందని సీజన్‌ నుంచి దూరం కానున్నాడని జట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. బౌలింగ్‌కు నాయకత్వం వహించే భువీ జట్టులో లేకపోవడం తమకి తీవ్ర ప్రతికూలాంశమని పేర్కొన్నాయి.

మరోవైపు దిల్లీ జట్టు సీనియర్‌ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా వేలి గాయంతో టోర్నీ నుంచి నుంచి దూరం కానున్నాడని దిల్లీ జట్టు ఉన్నతాధికారి ఒకరు జాతీయ మీడియాతో తెలిపారు. శనివారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో మిశ్రా వేలికి గాయమైన సంగతి తెలిసిందే. అతడు వేసిన తొలి ఓవర్‌లో నితీశ్‌ రాణా ఇచ్చిన రిటర్న్‌ క్యాచ్‌ను అందుకోవడానికి ప్రయత్నిస్తూ గాయపడ్డాడు. దీంతో గాయం కారణంగా తన స్పెల్‌ను పూర్తిచేయకుండానే ఆ మ్యాచ్‌ను ముగించాడు. అయితే అతడి స్కానింగ్ ఫలితాలు సానుకూలంగా లేవని, గాయం తీవ్రత అధికంగా ఉందని దిల్లీ జట్టు ఉన్నతాధికారి వెల్లడించారు. అంతేకాకుండా, అధికారిక ట్విటర్‌ వేదికగా కూడా స్పష్టం చేశారు.

‘‘రిపోర్ట్స్‌ వచ్చాయి. ఇది చెడ్డ వార్త. మిశ్రా ఈ సీజన్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడు. అతడి స్థానాన్ని మరొకరితో భర్తీ చేస్తాం. అయితే మంచి లయలో ఉన్న అతడు టోర్నీ నుంచి దూరం కావడం దురదృష్టకరం. అతడి అనుభవం మిడిల్‌ ఓవర్లలో జట్టుకే కాకుండా యువ స్పిన్నర్లకు ఎంతో ఉపయోగపడుతుంది’’ అని దిల్లీ జట్టు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. షార్జా వేదికగా శనివారం జరిగిన కోల్‌కతా×దిల్లీ మ్యాచ్‌లో 438 పరుగులు నమోదయ్యాయి. చిన్న మైదానంలో బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. కానీ రెండు ఓవర్లు వేసిన అమిత్‌ మిశ్రా 14 పరుగులే ఇచ్చాడు. తాను వేసిన తొలి ఓవర్‌లో గాయపడినా ఫిజియో చికిత్స అనంతరం మరో ఓవర్‌ బౌలింగ్‌ చేశాడు. ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్‌ గిల్‌ను పెవిలియన్‌కు పంపించి కోల్‌కతాను దెబ్బతీశాడు. అయితే తర్వాత నొప్పి అధికం కావడంతో డగౌట్‌కు చేరాడు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని