విరాట్‌ కోహ్లీకి కెప్టెన్సీ భారం కాదు

టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ భారం కాదని, అతడు సవాళ్లను ఎదుర్కోడానికే ఇష్టపడతాడని వెటరన్ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్ అన్నాడు. తాజాగా భారత్‌ రెండో వన్డేలోనూ చిత్తవ్వడంతో...

Updated : 20 Sep 2022 15:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ భారం కాదని, అతడు సవాళ్లను ఎదుర్కోవడానికే ఇష్టపడతాడని వెటరన్ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్ అన్నాడు. తాజాగా భారత్‌ రెండో వన్డేలోనూ చిత్తవ్వడంతో కోహ్లీ కెప్టెన్సీపై అనేక విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆదివారం మ్యాచ్‌ అనంతరం ఇండియా టుడేతో మాట్లాడిన భజ్జీ.. కోహ్లీకి సారథ్యం వహించడం భారం కాదని, కెప్టెన్‌గా అతడెలాంటి ఒత్తిడికి గురవడం లేదని పేర్కొన్నాడు. కోహ్లీ నాయకుడని, ముందుండి జట్టును నడిపిస్తాడని, ఇతరులకు ప్రేరణగా నిలుస్తాడని చెప్పాడు. 

గతేడాది వన్డే ప్రపంచకప్‌ తర్వాత కూడా తాను ఇదే విషయం చెప్పానని, కోహ్లీ ఒక్కడే మ్యాచ్‌లు గెలిపించలేడని సీనియర్‌ స్పిన్నర్‌ పేర్కొన్నాడు. రోహిత్‌, విరాట్‌ ఇద్దరే ఎక్కువ పరుగులు చేస్తున్నారని, రాహుల్‌ బాగా ఆడుతున్నా మిగిలిన ఆటగాళ్లు కూడా నిలకడగా పరుగులు చేయాల్సిన అవసరం ఉందన్నాడు. అలా జరిగితే కెప్టెన్‌ మీద భారం తగ్గుతుందని తెలిపాడు. దాంతో అతడు స్వేచ్ఛగా ఆడగలుగుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక ఆస్ట్రేలియాలో ఘోరంగా విఫలమవుతున్న చాహల్‌ బౌలింగ్‌పై స్పందించిన భజ్జీ.. అతడి విషయంలో ఎలాంటి తప్పులేదన్నాడు. ఐపీఎల్‌లో అతడు చెలరేగడానికి పిచ్‌లే కారణమని, యూఏఈతో పోలిస్తే ఆస్ట్రేలియాలో అవి పూర్తి భిన్నంగా ఉంటాయన్నాడు. అందువల్లే చాహల్‌ వికెట్లు తీయలేకపోతున్నాడని పేర్కొన్నాడు. కోహ్లీ చెప్పినట్లు కంగారూ ఆటగాళ్లకు తమ మైదానాలపై పూర్తి అవగాహన ఉందని, ఆ పరిస్థితులను వారు సద్వినియోగం చేసుకుంటున్నారని వివరించాడు. చాహల్‌ రాణించాలంటే బంతిని కాస్త నెమ్మదిగా వదలాలని, దాంతో అది కొంచెం టర్న్‌ తీసుకుంటుందని సూచన చేశాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని