కోహ్లీని రెచ్చగొడితే.. నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాడు

టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీని ఎక్కువగా రెచ్చగొడితే ప్రత్యర్థులు ఎవరనేది చూడకుండా నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాడని

Published : 15 Dec 2020 02:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీని ఎక్కువగా రెచ్చగొడితే ప్రత్యర్థులు ఎవరనేది చూడకుండా నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాడని ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ పేర్కొన్నాడు. గురువారం నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టులో కోహ్లీతో తలపడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని తన సహచరులకు సూచించాడు. ఇరు జట్ల మధ్యా ఎన్నో ఏళ్లుగా మాటల యుద్ధం జరుగుతోందని.. ఇప్పుడు కూడా అలా జరిగే అవకాశం ఉందని సందేహం వెలిబుచ్చాడు. ఇరు జట్లలో ఢీ అంటే ఢీ అనే ఆటగాళ్లుంటే కచ్చితంగా అలాంటివి చోటుచేసుకునే వీలుందన్నాడు. అయితే, ఇప్పుడు ఇరు జట్లలో మంచి వాతావరణం ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లీని రెచ్చగొట్టొద్దని ఫించ్‌ ఆస్ట్రేలియా ఆటగాళ్లను హెచ్చరించాడు.

ఒక వ్యక్తిగా మైదానం బయట కోహ్లీ ప్రశాంతంగా ఉంటాడని ఆసీస్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌ చెప్పాడు. విరాట్‌ ఆటను అర్థం చేసుకొని మెలుగుతాడని తెలిపాడు. అలాగే ఐపీఎల్‌లో బెంగళూరు సారథిగా విరాట్‌ కోహ్లీ ప్రణాళికలు చూసి ఆశ్చర్యపోయానని ఫించ్‌ అన్నాడు. ప్రతి ఆటగాడి పట్ల చాలా నమ్మకంతో ఉంటాడన్నాడు. ఇదిలా ఉండగా, ఇటీవల పూర్తి అయిన పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆస్ట్రేలియా ఫించ్‌ కెప్టెన్సీలో 2-1 తేడాతో వన్డే సిరీస్‌ గెలుపొందగా, 1-2 తేడాతో పొట్టి సిరీస్‌ కోల్పోయింది. ఈ క్రమంలోనే ఈనెల 17 నుంచి రెండు జట్లూ 4 టెస్టుల సిరీస్‌లో తలపడనున్నాయి. అయితే, తొలి టెస్టు తర్వాత టీమ్‌ఇండియా సారథి భారత్‌కు తిరిగి వస్తున్న సంగతి తెలిసిందే. అనుష్క త్వరలో తల్లికాబోతున్నందున అతడు పితృత్వపు సెలవులు తీసుకున్నాడు.

ఇవీ చదవండి..
బ్యాట్‌తో చుక్కలు.. బంతితో నిప్పులు..  
మరిన్ని డబుల్‌ ధమాకాలు రానున్నాయి: రోహిత్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని