T20 World Cup: కథ ముగిసె..!?

బ్యాట్స్‌మెన్‌ మరోసారి బ్యాట్లెత్తేసిన వేళ ఆశలు ఆవిరి..! వరుసగా రెండో ఓటమితో టీ20 ప్రపంచకప్‌ నుంచి భారత్‌ ఔట్‌!

Updated : 01 Nov 2021 07:17 IST

 బ్యాట్స్‌మెన్‌ ఘోర వైఫల్యం

 భారత్‌కు రెండో ఓటమి

 సెమీస్‌ అవకాశాలు సంక్లిష్టం

 న్యూజిలాండ్‌ ఘనవిజయం

దుబాయ్‌

బ్యాట్స్‌మెన్‌ మరోసారి బ్యాట్లెత్తేసిన వేళ ఆశలు ఆవిరి..!

వరుసగా రెండో ఓటమితో టీ20 ప్రపంచకప్‌ నుంచి భారత్‌ ఔట్‌!

టోర్నీలో సాంకేతికంగా మిగిలే ఉన్నా.. వాస్తవికంగా టీమ్‌ఇండియా కథ ముగిసినట్లే. కోట్ల మందిని నిరాశపరిచిన కోహ్లీసేన ఇక చేయగలిగేదేమీ లేదు.. మిగతా మ్యాచ్‌ల్లో విజయాలతో ఊరడించడం, అద్భుతాల కోసం ఎదురుచూడడం తప్ప!

న్యూజిలాండ్‌పై మనోళ్ల ప్రదర్శన దారుణం. పాకిస్థాన్‌ ఇచ్చిన షాక్‌ నుంచి తేరుకుంటుందనుకుంటే.. సెమీస్‌ ఆశలు నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో భారత్‌ ఆట మరింత తీసికట్టుగా మారింది. కివీస్‌ బౌలర్లను ఎదురొడ్డి ఒక్క బ్యాట్స్‌మన్‌ నిలబడితే ఒట్టు. షాట్లు ఆడడమే తెలియదన్నట్లు మూకుమ్మడిగా ప్రత్యర్థి బౌలర్లకు తలవంచారు. ఇన్నింగ్స్‌ మొత్తంలో కేవలం 8 ఫోర్లు, 2 సిక్స్‌లు మాత్రమే వచ్చాయంటే.. ఏకంగా 54 డాట్‌ బాల్స్‌ పడ్డాయంటే, ఓ దశలో 71 బంతుల పాటు ఒక్క బౌండరీ కూడా రాలేదంటే.. మన బ్యాట్లు ఎలా మూగబోయాయో అర్థం చేసుకోవచ్చు.

నిజమే.. టాస్‌ గెలిచిన జట్టు లాభపడుతోంది. నిజమే.. మొదట బ్యాటింగ్‌ చేయడం కాస్త కష్టంగానే ఉంది. నిజమే.. షాట్లు కొట్టడం తేలిగ్గా ఏమీ లేదు. అయినా.. బ్యాటింగ్‌ మరీ ఇంత దారుణమా? ప్రపంచకప్‌కు ముందు భారత ఆటగాళ్లు ఐపీఎల్‌ కోసం చాలా రోజులు యూఏఈలోనే ఉన్నారుగా! ఎన్నో మ్యాచ్‌లు ఆడిన వారికి పరిస్థితులపై అవగాహన ఉండే ఉండాలి కదా! ఇంత పేలవ బ్యాటింగ్‌, పరుగుల కోసం అంతలా అవస్థ పడడం అభిమానులకు మింగుడుపడనిదే. భారత్‌పై అలవోకగా విజయం సాధించిన న్యూజిలాండ్‌.. పసికూనల చేతిలో కంగుతిని, మనోళ్ల ఆశలకు ఊతమిస్తుందనుకోవడం అత్యాశే అవుతుంది.

టీమ్‌ఇండియాకు మరో పరాభవం. టీ20 సెమీఫైనల్‌ ఆశలు దాదాపుగా గల్లంతు. బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైన భారత్‌ ఆదివారం ఏకపక్షంగా సాగిన సూపర్‌-12 మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ చేతిలో ఓడిపోయింది. బ్యాటుతో తేలిపోయిన కోహ్లీసేన మొదట 7 వికెట్లకు 110 పరుగులే చేయగలిగింది. జడేజా (26 నాటౌట్‌; 19 బంతుల్లో 2×4, 1×6) టాప్‌ స్కోరర్‌. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఇష్‌ సోధి (2/17), బౌల్ట్‌ (3/20), సౌథీ (1/26) భారత్‌ను దెబ్బతీశారు. మిచెల్‌ (49; 35 బంతుల్లో 4×4, 3×6) మెరవడంతో లక్ష్యాన్ని కివీస్‌ 14.3 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత్‌ తన తొలి మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ చేతిలో ఓడిన సంగతి తెలిసిందే.


అలవోకగా..

స్వల్ప లక్ష్యాన్ని న్యూజిలాండ్‌ అలవోకగా ఛేదించింది. భారత బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఓపెనర్‌ మిచెల్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌తో కివీస్‌ పనిని మరింత తేలిక చేశాడు. మరో ఓపెనర్‌ గప్తిల్‌ (20) నాలుగో ఓవర్లో ఔట్‌ కాగా.. ఆ తర్వాత మిచెల్‌ దూకుడు మొదలైంది. జడేజా వేసిన ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్లో సిక్స్‌, రెండు ఫోర్లు కొట్టాడు. జోరును కొనసాగించిన అతడు. విలియమ్సన్‌ (33 నాటౌట్‌)తో రెండో వికెట్‌కు 72 పరుగులు జోడించి 13వ ఓవర్లో జట్టు స్కోరు 96 వద్ద ఔటయ్యాడు. కాన్వేతో కలిసి విలియమ్సన్‌ లాంఛనాన్ని పూర్తి చేశాడు.


అతి కష్టంగా..

టాస్‌ గెలిస్తే ఫీల్డింగ్‌ ఎంచుకోవడం.. అనుకూలించే పరిస్థితుల్లో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేయడం. ప్రపంచకప్‌ ఆరంభం నుంచి జట్లు చేస్తున్నదిదే. ఆదివారం న్యూజిలాండ్‌ది కూడా ఇదే ఫార్ములా. కివీస్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడం, బంతి.. బ్యాటుపైకి సరిగా రాకపోవడంతో భారత బ్యాట్స్‌మెన్‌కు షాట్లు ఆడడం కష్టమైపోయింది. పరుగులు కష్టంగా వచ్చాయి. ఒక్క భారత బ్యాట్స్‌మన్‌ కూడా సాధికారికంగా, ధాటిగా ఆడలేకపోయాడు. కివీస్‌ బౌలింగ్‌ దాడిని ఆరంభించిన బౌల్ట్‌, సౌథీ బ్యాట్స్‌మెన్‌కు ఏమాత్రం స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇవ్వలేదు. రోహిత్‌కు బదులు రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇషాన్‌ కిషన్‌ (4)ను బౌల్ట్‌ మూడో ఓవర్లోనే ఔట్‌ చేశాడు. అయితే కఠిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుంటే.. పవర్‌ప్లే ముగిసే సరికి 35 పరుగులు చేసిన భారత్‌, రెండు వికెట్లు కోల్పోయినా ఫర్వాలేదనిపించే స్థితిలో ఉన్నట్లనిపించింది. పుంజుకోగలదనిపించింది. రాహుల్‌ (18; 16 బంతుల్లో 3×4) ఓ ఫోర్‌, రోహిత్‌ ఫోర్‌, సిక్స్‌ బాదడంతో మిల్నె వేసిన అయిదో ఓవర్లో 15 పరుగులొచ్చాయి. తర్వాతి ఓవర్లోనే రాహుల్‌ ఓ భారీ షాట్‌కు యత్నించి వెనుదిరిగాడు. అయితే ఆశించినట్లుగా పవర్‌ప్లే తర్వాత భారత్‌ పుంజుకోపోకపోగా.. పాకిస్థాన్‌పై కంటే కూడా ఎక్కువగా ఇబ్బందిపడింది.


పరుగే బంగారమాయె...

స్కోరు బోర్డును బహిష్కరిస్తూ.. బౌండరీలు పూర్తిగా మొహం చాటేశాయి. సింగిల్స్‌ కూడా భారంగా వచ్చాయి. డాట్‌ బాల్స్‌కు లెక్కేలేదు. బ్యాట్స్‌మెన్‌ గట్టిగా బ్యాటు ఊపిందే లేదు. ఊపినా బంతికి సరిగా తగలదు. ఇదీ పవర్‌ప్లే తర్వాత పరిస్థితి. స్లో పిచ్‌పై కివీస్‌ స్పిన్నర్లు సోధి, శాంట్నర్‌ కూడా బ్యాట్స్‌మెన్‌ను కట్టిపడేశారు. 7 నుంచి 16 ఓవర్ల మధ్య ఒక్క బౌండరీ కూడా రాలేదంటే భారత్‌ పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. వికెట్లు మాత్రం క్రమం తప్పకుండా పడ్డాయి. ఎదుర్కొన్న తొలి బంతికే మిల్నె తేలికైన క్యాచ్‌ను వదిలేయడంతో బతికిపోయిన రోహిత్‌ (14; 14 బంతుల్లో 1×4, 1×6) అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఎనిమిదో ఓవర్లో నిష్క్రమించాడు. ఉన్నంత సేపు సింగిల్స్‌ కోసం కూడా అవస్థపడ్డ కెప్టెన్‌ కోహ్లి (17 బంతుల్లో 9) చివరికి సహనం నశించి, సోధి బౌలింగ్‌లో ఓ భారీ షాట్‌ ఆడబోయి బౌల్ట్‌కు చిక్కాడు. రిషబ్‌ పంత్‌ (12) కూడా అంతే. స్ట్రోక్‌ ప్లే కు ఏమాత్రం అనుకూలంగా లేని పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడ్డాడు. 19 బంతులాడి ఒక్క బౌండరీ అయినా కొట్టకుండానే నిష్క్రమించాడు. హార్దిక్‌ పాండ్య (23; 24 బంతుల్లో 1×4), జడేజా నిలబడ్డా... వారి ఆట జట్టు కష్టంగా 100కు చేరుకోవడానికి ఉపయోగపడిందే తప్ప గౌరవప్రదమైన స్కోరును ఇవ్వలేకపోయింది. 16వ ఓవర్లో హార్దిక్‌ ఓ ఫోర్‌ కొట్టాడు. 71 బంతుల తర్వాత భారత్‌కు లభించిన బౌండరీ అది. జడేజా రెండు ఫోర్లు, ఒక సిక్స్‌ కొట్టడంతో చివరి మూడు ఓవర్లలో భారత్‌కు 24 పరుగులొచ్చాయి. 19వ ఓవర్లో హార్దిక్‌, శార్దూల్‌లను బౌల్ట్‌ ఔట్‌ చేశాడు. సూర్యకుమార్‌ గాయపడడంతో అతడి స్థానంలో ఈ మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్‌ అవకాశం దక్కింది. భువి స్థానంలో శార్దూల్‌ జట్టులోకి వచ్చాడు.


1

ఈ ప్రపంచకప్‌లో ఓ జట్టు ఇన్నింగ్స్‌లో 7 నుంచి 15వ ఓవర్ల మధ్య ఒక్క బౌండరీ కూడా రాకపోవడం ఇదే తొలిసారి. భారత బ్యాటింగ్‌లో ఈ ఓవర్ల మధ్యలో ఒక్క ఫోర్‌, సిక్సర్‌ కూడా రాలేదు.

 


భారత్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) మిచెల్‌ (బి) సౌథీ 18; కిషన్‌ (సి) మిచెల్‌ (బి) బౌల్ట్‌ 4; రోహిత్‌ (సి) గప్తిల్‌ (బి) సోధి 14; కోహ్లి (సి) బౌల్ట్‌ (బి) సోధి 9; పంత్‌ (బి) మిల్నె 12; హార్దిక్‌ (సి) గప్తిల్‌ (బి) బౌల్ట్‌ 23; జడేజా నాటౌట్‌ 26; శార్దూల్‌ (సి) గప్తిల్‌ (బి) బౌల్ట్‌ 0; షమి నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 4 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 110 వికెట్ల పతనం: 1-11, 2-35, 3-40, 4-48, 5-70, 6-94, 7-94; బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-20-3; సౌథీ 4-0-26-1; శాంట్నర్‌ 4-0-15-0; మిల్నె 4-0-30-1; సోధి 4-0-17-2

న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: గప్తిల్‌ (సి) శార్దూల్‌ (బి) బుమ్రా 20; మిచెల్‌ (సి) రాహుల్‌ (బి) బుమ్రా 49; విలియమ్సన్‌ నాటౌట్‌ 33; కాన్వే నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 7 మొత్తం: (14.3 ఓవర్లలో 2 వికెట్లకు) 111
వికెట్ల పతనం: 1-24, 2-96 బౌలింగ్‌: వరుణ్‌ చక్రవర్తి 4-0-23-0; బుమ్రా 4-0-19-2; జడేజా 2-0-23-0; షమి 1-0-11-0; శార్దూల్‌ ఠాకూర్‌ 1.3-0-17-0; హార్దిక్‌ 2-0-17-0

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని