ధోనీ అంటే అంతేగా.. అంతేగా! 

టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినీషర్‌ అని ఆస్ట్రేలియా పేసర్‌ పాట్‌ కమిన్స్‌ మరోసారి గుర్తుచేసుకున్నాడు. తాజాగా ఆ జట్టు ఇంగ్లాండ్‌తో...

Updated : 06 Sep 2020 14:09 IST

అలాంటోడి కోసం చూస్తున్నాం : పాట్‌కమిన్స్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినీషర్‌ అని ఆస్ట్రేలియా పేసర్‌ పాట్‌ కమిన్స్‌ మరోసారి గుర్తుచేసుకున్నాడు. తాజాగా ఆ జట్టు ఇంగ్లాండ్‌తో తలపడిన మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ను రెండు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆ జట్టు గెలిచే అవకాశమున్నా ప్రధాన బ్యాట్స్‌మెన్‌ తేలిపోయారు. చివరి 3 ఓవర్లలో 27 పరుగులు చేయాల్సి ఉన్నా 25 పరుగుల దాకా నెట్టుకొచ్చారు. మార్కస్‌ స్టోయినిస్‌ వంటి మేటి బ్యాట్స్‌మన్‌ ఉన్నా జట్టును గెలిపించలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌ అనంతరం ఓ మీడియాతో మాట్లాడిన కమిన్స్‌.. ధోనీని గుర్తు చేసుకున్నాడు. అతడు ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినీషర్‌ అని, అతడికున్న అనుభవంతో ఆ స్థాయికి చేరాడని చెప్పాడు. తాము కూడా మహీ వంటి ఫినీషర్‌ కోసం చూస్తున్నట్లు తెలిపాడు. 

‘జట్టులో ఈ విషయంపై చర్చించాము. ప్రాక్టీస్‌ సెషన్‌లోనూ మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌పై శ్రద్ధ తీసుకున్నాం. అక్కడ రాణించడం అంత తేలికైన పని కాదు, ఏ జట్టుకైనా కష్టతరమే. ఈ విషయంపై మా సెలెక్టర్లు, కెప్టెన్‌ కూడా చర్చించారు. మిడిల్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేసే ఆటగాళ్లపై ప్రత్యేక దృష్టి సారించాం. అయితే, ఫలితాలు ఇప్పుడే రావు. మాకు మంచి జట్టే ఉంది. సరైన ఆటగాళ్లు ఉన్నారు. అందరూ తగినన్ని మ్యాచ్‌లు ఆడాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నాడు. ఇక ఆరు నెలల తర్వాత మళ్లీ  క్రికెట్‌ ఆడటంపై స్పందించి కమిన్స్‌.. ఇప్పుడు ఆటగాళ్ల ప్రదర్శనలో ఎటువంటి మార్పులు రాలేదని, అయితే, ఈ అనుభవం కొత్తగా ఉందని చెప్పాడు. ప్రేక్షకులు లేకుండా ఆడటం వల్ల స్టేడియంలో సందడి లేదన్నాడు. ఇది కాస్త కొత్తగా అనిపించినా తర్వాత అలవాటు పడ్డామన్నాడు. ఇంగ్లాండ్‌ వంటి దేశంలో ఇలా క్రికెట్‌ అభిమానులు లేక వారు పాడే పాటలు వినలేకపోయినట్లు చెప్పాడు. మరోవైపు ఈ సిరీస్‌లో ఇంగ్లాండ్‌ ఇప్పటికే శుభారంభం చేయగా నేడు జరిగే రెండో టీ20లో ఆస్ట్రేలియా కచ్చితంగా గెలవాలి. లేదంటే సిరీస్‌ కోల్పోయే ప్రమాదం ఉంది. ఒకవేళ ఆ జట్టు‌ గెలిస్తే ఇక మంగళవారం చివరి మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంటుంది. అప్పుడు ఎవరు గెలిస్తే వారిదే సిరీస్‌ సొంతం అవుతుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని