‘ట్రంప్ బాబాయ్‌ కామెడీ మిస్ అవుతాం’

అమెరికా అధ్యక్షుడిగా డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ గెలుపొందడంతో ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నారు. మరోవైపు ఓటమిపాలైనా

Updated : 09 Nov 2020 05:05 IST

అమెరికా ఎన్నికల ఫలితాలపై క్రికెటర్ల ట్వీట్‌లు

ఇంటర్నెట్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడిగా డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ గెలుపొందడంతో ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నారు. మరోవైపు ఓటమిపాలైనా తానే విజయం సాధించానని ట్విటర్‌లో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న డొనాల్డ్‌ ట్రంప్‌పై కొందరు వ్యంగ్యంగా ట్వీట్‌లు చేస్తున్నారు. టీమిండియా మాజీ ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్‌, వసీమ్‌ జాఫర్‌ కూడా ట్రంప్‌ ఓటమిపై సరదాగా ట్వీట్‌లు చేశారు.

‘‘మా వాళ్లు అలాగే ఉన్నారు. ట్రంప్‌ బాబాయ్‌ కామెడీ మిస్‌ అవుతాం’’ అని సెహ్వాగ్‌ ట్వీట్‌ చేశాడు. ఎన్నికల ఫలితం వెలువడటానికి గంట ముందు ట్రంప్ చేసిన ట్వీట్‌పై వసీమ్‌ జాఫర్‌ పంచ్‌‌ వేశాడు. ‘‘ఈ ఎన్నికల్లో నేను గెలిచాను. భారీ విజయం’’ అని ట్రంప్‌ చేసిన ట్వీట్‌ను పోస్ట్‌ చేసి.. ‘‘ఈ సీజన్‌లో పంజాబ్‌ ట్రోఫీ గెలిచింది. భారీ విజయం’’ అని ట్వీటాడు. ప్రస్తుతం జరుగుతున్న 13వ సీజన్‌లో పంజాబ్‌ లీగ్‌ దశలోనే ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆ జట్టు ట్రోఫీని అందుకోలేదు. ఈ సీజన్‌లో పంజాబ్‌కు జాఫర్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా పనిచేస్తున్నాడు.

అయితే ఎన్నికల్లో జో బైడెన్‌ విజయం సాధిస్తారని రాజస్థాన్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ ముందే ఊహించి ట్వీట్‌ చేశాడని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ విషయాన్ని 2014 అక్టోబర్‌లోనే ట్వీట్‌ చేశాడని నెటిజన్లు తెలుపుతున్నారు. ఆర్చర్ పోస్ట్‌ చేసిన ‘జో’ అనే ట్వీట్‌ను రాజస్థాన్‌ జట్టు కూడా రీట్వీట్‌ చేసింది. ఇంగ్లాండ్‌ క్రికెటర్‌ అయిన జోఫ్రా ఆర్చర్‌ను నోస్ట్రాడామస్‌గా పిలుస్తుంటారు. అతడు భవిష్యత్తులో జరిగే విషయాలను ముందుగానే ఊహించి ట్వీట్లు చేస్తుంటాడని అంటుంటారు. యాదృచ్ఛికంగా అవి నిజమే అన్నట్టుగా ఉంటాయి. క్రిస్‌గేల్‌ 99 పరుగుల వద్ద ఔట్‌, ప్రధాని 21 రోజుల లాక్‌డౌన్, 2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో సూపర్ ఓవర్‌, వరుసగా 4 సిక్సులు, ఒకే ఓవర్లో 30 పరుగులు.. ఇలా ఆర్చర్‌ చేసిన ట్వీట్‌లు నెట్టింట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు