లక్ష్యం ఒలింపిక్స్‌.. బరిలోకి నీరజ్‌

ఒలింపిక్స్‌ పసిడిని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా సాగుతున్న భారత స్టార్‌ జావెలిన్‌ త్రో అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా కఠిన సవాలుకు సిద్ధమయ్యాడు. శుక్రవారం ఆరంభమయ్యే ప్రతిష్ఠాత్మక డైమండ్‌ లీగ్‌ తొలి అంచె పోటీల్లో అతను డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలో దిగుతున్నాడు.

Updated : 10 May 2024 05:23 IST

నేడు డైమండ్‌ లీగ్‌ తొలి అంచె పోటీలు

దోహా: ఒలింపిక్స్‌ పసిడిని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా సాగుతున్న భారత స్టార్‌ జావెలిన్‌ త్రో అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా కఠిన సవాలుకు సిద్ధమయ్యాడు. శుక్రవారం ఆరంభమయ్యే ప్రతిష్ఠాత్మక డైమండ్‌ లీగ్‌ తొలి అంచె పోటీల్లో అతను డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలో దిగుతున్నాడు. పారిస్‌ ఒలింపిక్స్‌ నేపథ్యంలో ఈ సీజన్‌ను మెరుగ్గా ఆరంభించాలని 26 ఏళ్ల నీరజ్‌ పట్టుదలతో ఉన్నాడు. చాలా రోజులుగా ఊరిస్తున్న 90 మీటర్ల దూరాన్ని కూడా అందుకోవాలని చూస్తున్నాడు. ఈ ప్రపంచ ఛాంపియన్‌కు అండర్సన్‌ పీటర్స్‌ (గ్రెనెడా), జాకబ్‌ వాద్లెచ్‌ (చెక్‌ రిపబ్లిక్‌), జులియన్‌ వెబర్‌ (జర్మనీ) నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశముంది. పోటీపడుతున్న 10 మంది జావెలిన్‌ త్రోయర్లలో మరో భారత క్రీడాకారుడు కిశోర్‌ జెనా కూడా ఉన్నాడు. డైమండ్‌ లీగ్‌ అరంగేట్రం చేయబోతున్న అతని వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శన 87.54మీ. నీరజ్‌ చోప్రా ఉత్తమ ప్రదర్శన 89.94మీ.గా ఉంది. ఈ డైమండ్‌ లీగ్‌ రెండో అంచె పోటీలు మే 19న మొరాకోలో జరుగుతాయి.

90 మీ.అందుకుంటా: ఈ ఏడాది కచ్చితంగా 90 మీటర్ల లక్ష్యాన్ని చేరుకుంటానని నీరజ్‌ చెప్పాడు. ‘‘90మీ. అందుకుంటా అని గతేడాది చెప్పా కానీ 88మీ. దూరమే విసిరా. ఈ ఏడాది చెప్పను చేసి చూపిస్తా. 2018 ఆసియా క్రీడల్లో 88.06మీ. ప్రదర్శన చేసినప్పటి నుంచి జనాలు ఈ ప్రశ్న అడుగుతూనే ఉన్నారు. కానీ ఆ తర్వాత చాలా విషయాలు జరిగాయి. మోచేతి గాయమైంది. శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు 88మీ. నుంచి 90మీ. మధ్య ఉన్నా. ఈ ఏడాది కచ్చితంగా ఆ లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటున్నా. 90మీ. ప్రదర్శనకు దోహా ప్రసిద్ధి అని నిరుడు చెప్పా. కానీ అప్పుడు ఎదురు గాలి వల్ల సాధించలేకపోయా. కానీ శుక్రవారం మనకు మంచి రోజవుతుంది. ఈ ఒలింపిక్స్‌లో పసిడి గెలవాలనే అంచనాలుంటాయి. కానీ ప్రపంచంలోని అత్యుత్తమ అథ్లెట్లు పోటీపడటం వల్ల అదంత సులువు కాదు. ఆరోగ్యంగా ఉంటూ టెక్నిక్‌పై ధ్యాస పెట్టడంపైనే నా దృష్టి. నేను ఆరోగ్యంగా ఉంటే అన్ని కుదురుతాయి’’ అని నీరజ్‌ తెలిపాడు. ఈ నెల 12న భువనేశ్వర్‌లో ఆరంభమయ్యే ఫెడరేషన్‌ కప్‌ జాతీయ సీనియర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో నీరజ్‌ పోటీపడే అవకాశముంది. మూడేళ్లలో అతను స్వదేశంలో పోటీల్లో పాల్గొనడం ఇదే తొలిసారి కానుంది. ‘‘ఆటే నాకు అన్నింటికంటే ముఖ్యమైంది. భారత్‌లో ఆడితే నాకూ మంచిదే. కానీ శుభకార్యాలు, వివాహాలు ఉండటంతో కుటుంబం, స్నేహితులతో సమయం గడపాల్సి ఉంది. అంతకంటే ముఖ్యంగా ఒలింపిక్‌ ఏడాది శిక్షణ కొనసాగించాలి. టోక్యో ఒలింపిక్స్‌ కంటే ముందు భారత్‌లో సాధన చేశా. కానీ ఇప్పుడు ఆటపైనే దృష్టి పెట్టిన నేను కొద్దికాలం తర్వాత తిరిగి భారత్‌లో ప్రాక్టీస్‌ కొనసాగిస్తా. కోహ్లి లేదా ధోనీలా కాదు కానీ నేనూ చాలా మంది జనాలకు తెలుసు. భారత్‌ వెళ్లినప్పుడు ప్రజలు నన్ను గుర్తుపడతారు. అథ్లెటిక్స్‌కు ఇది మంచిదే. ఒలింపిక్‌ పసిడి కారణంగా అథ్లెటిక్స్‌ గురించి తెలుసుకోవడంతో పాటు అనుసరిస్తున్నారు’’ అని నీరజ్‌ పేర్కొన్నాడు. బంధన (నుదురుపై చుట్టుకునే వస్త్రం) లేకుండా త్రో విసరలేరా అనే ప్రశ్నకు.. ‘‘లేదు. బంధన లేకుండా త్రో విసరడం మంచిది కాదు. ఫౌల్‌ లైన్‌ను చూడలేం’’ అని నవ్వుతూ నీరజ్‌ బదులిచ్చాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని